తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడవడం పై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు చెప్పే గరుడ పురాణాలు నమ్మే పరిస్థితి లేదని చురకలంటించారు విజయసాయిరెడ్డి. “ఓడిన ప్రతిసారీ ప్రజలను నిందించడం పచ్చ బాస్ కే కాదు, విశ్లేషకుల ముసుగులో పచ్చతోలు కప్పుకున్న వారికీ అలవాటే. జనం స్వార్ధపరులని, ఆంధ్రులకు ఆత్మాభిమానం లేదని, ఐక్యమత్యం లేదంటూ నిందించే బదులు ఆత్మ విమర్శ చేసుకోవచ్చుగా? అయినా జనం ‘గరుడ పురాణాలు’ నమ్మే పరిస్థితి లేదులే.” అంటూ ట్వీట్ చేశారు విజయ సాయి రెడ్డి.
సంస్కారం వలువల్ని గాలికొదిలి నోరు పారేసుకుంటే ప్రజలు హర్షించరని… కర్రుకాల్చి వాతలు పెడతారని మినీ మున్సిపల్ ఎన్నికలతో మరోసారి స్పష్టమైందని ఫైర్ అయ్యారు. తండ్రీకొడుకులిద్దరూ స్థాయిమర్చి, నీచాతినీచమైన భాషను వాడారు. బూతులు తిట్టడం ప్రజాసేవ కాదని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదన్నారు. నిన్న పట్టణాల్లో పట్టం కట్టిన ప్రజలు నేడు గ్రామాల్లో వైసీపీని ఘనంగా గెలిపించారని… ప్రజా తీర్పుతో మా బాధ్యత మరింత పెరిగింది. ప్రచారంలో కాకిగోల చేసిన వాళ్ళు కనుమరుగయ్యారని చురకలు అంటించారు. అభివృద్ది, సంక్షేమానికే ప్రజలు జేజేలు పలికారు. సైంధవపాత్ర పోషిస్తే ఏమౌతుందో ప్రతిపక్షానికి అద్దంలో చూపించారని వెల్లడించారు విజయసాయిరెడ్డి.