సర్పంచ్‌లను కేసీఆర్.. భిక్షగాళ్లను చేశాడని విజయశాంతి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కారు తీరు చూస్తుంటే… తన ఇంటిని తనే దోచుకుంటున్న వైనంగా కనిపిస్తోంది. పంచాయితీల కోసం కేంద్ర 15వ ఆర్థిక సంఘం జమ చేసిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచ్‌ల ఆవేదన, రాజీనామాలు కేసీఆర్ సర్కారు నక్క జిత్తుల వ్యవహారాన్ని బట్టబయలు చేస్తున్నాయని ఆగ్రహించారు.
సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల డిజిటల్ కీస్‌ని అధికారుల సాయంతో ఉపయోగించి నిధులు మళ్లిస్తూ తమకు దిక్కుతోచకుండా చేస్తున్నరని… ఫలితంగా కరెంట్ బిల్లులు కట్టలేక, కార్మికులకు జీతాలివ్వలేక ఇంకా ఇతర సమస్యలతో నానా బాధలు పడుతున్నమని సర్పంచ్‌లు మండిపడుతున్నారన్నారు.
అప్పులు చేసి మరీ గ్రామాభివృద్ధికి పనులు చేయిస్తే… ఆ బిల్లులు సైతం ఇవ్వకపోగా ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని సైతం లాక్కోవడంపై నిప్పులు కక్కుతున్నరు. సర్పంచ్‌లు ఇప్పటికే డీపీవో ఆఫీసుల్ని చుట్టుముట్టారు…. మరి కొందరు సర్కారు తీరుకు నిరసనగా నిధుల కోసం భిక్షాటన కూడా చేపట్టారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ సర్కారు… చివరికి భిక్షాటన చేసే పరిస్థితికి సర్పంచ్‌లను దిగజార్చారని విజయశాంతి నిప్పులు చెరిగారు.