ఊసరవెల్లి కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే : విజయశాంతి

-

రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి… కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని హెచ్చరించిన సీఎం కేసీఆర్… పంటకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని వడ్ల ముచ్చటను మర్చిపోయేలా… ఊరూరా రైతుబంధు సంబురాలు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని విజయశాంతి ఫైర్‌ అయ్యారు. డప్పుల దర్వులతో రైతుబంధును జాకీలతోని లేపాలే అన్నట్టుగా… మీడియాల కవరేజ్ మిస్ గాకుంట జూడాలే అన్నట్టుగా వారం రోజుల నుండి రైతుబంధు రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్వరోగనివారిణి రైతుబంధే అన్నట్టు…కరోనా నిబంధనల్ని కాళ్ల కింద వేసి తొక్కి మరీ చారణ కోడికి బారాణ మసాల తీరుగా ప్రచారం చేస్తున్నారని… కానీ అసలు ఈ రైతుబంధు వారోత్సవాలు ఎందుకోసం? అని ప్రశ్నించారు… రైతులకు రూ. లక్ష లోపు ఉన్న పంట రుణాలను సీఎం కేసీఆర్ మాఫీ చేయనందుకా? లేక 2018 ఎన్నికల ముందు రైతులందరికి ఉచితంగా ఎరువులు ఇస్తానని ఇయ్యనందుకా? పోనీ ఏడేండ్ల కేసీఆర్ ఏలుబడిలో వేలాది మంది రైతుల ఉసురు తీసుకున్నందుకా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయందుకా? ఎందుకు ఈ రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో రాష్ట్ర రైతాంగానికి తెలపాలన్నారు.

ఇదే అంశంపై నల్గొండ జిల్లాలో ఓ యువ రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ… రుణమాఫీ చేసి ఉంటే బ్యాంకులో అప్పు పుట్టి మళ్ళా వ్యవసాయం చేసుకొనేవాడినని… రుణమాఫీ చేయకపోవడంతోనే తన భూమి అమ్ముకున్నానని నిరసన తెలుపుతుంటే… అధికారపార్టీ నేతలు తనని అడ్డుకొని కొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ సర్కార్… నేడు రైతులను మోసగించాలని చూస్తే… వారు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలని చురకలు అంటించారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో ఈ ఊసరవెల్లి కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించక మానరని ఫైర్‌ అయ్యారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news