బ్రేకింగ్ : ఈ నెల 24న బీకజేపీలోకి విజయశాంతి ?

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలలో ఉన్న విజయశాంతి బీజేపీకి చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆమె ఖండించనూ లేదు అలాగని సమర్దించడం లేదు, దీంతో ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె బిజెపిలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్టు చెబుతున్నారు. ఆమె ఈనెల 24వ తేదీన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే కాని పార్టీ మారతారు అని అనుకోవడం లేదని చెబుతున్నారు. ఇక ఈ రోజు కూడా విజయశాంతి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

అందులో ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ కంటే బీజేపీనే బలంగా ఉంది అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం ఇప్పుడు ఈ చేరిక వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారని కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందని అన్నారు. అలానే మరికొంత ముందుగానే ఠాగూర్ రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవని ఆమె చెబుతున్నట్టున్న ప్రెస్ నోట్ రిలీజ్ అయింది.