వాయు గుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ శివారు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. శివారులో అతి భారీ వర్షం కురుస్తుండడంతో నగరం నుండి బయయకు వెళ్లే ప్రధాన రహదారుల్లో పెద్ద వాగుల్లా వరద ప్రవహిస్తోంది.
దీంతో నగరానికి వచ్చే వాహనదారులు , నగరం నుండి బయటకు వెళ్లే వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. చీకట్లో ఎటు వెళ్లలో తెలియక అవస్థలు పడుతున్నారు వాహనదారులు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇనాంగూడ వద్ద విజయవాడ జాతీయ రహదారి పై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో కార్లు నీట మునిగాయి. దీంతో విజయవాడ నుండి హైదరాబాద్ కు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకి రావొద్దంటున్నారు అధికారులు. మరో రెండు రోజులపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.