అక్కడ అధికారపార్టీ నేతల తీరు కేడర్‌ను నైరాశ్యంలోకి నెడుతోందట. పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులే కాదు.. పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వాళ్లు..ఏదైనా పదవి రాకపోతుందా అని ఎదురుచూస్తున్న వాళ్ల పరిస్థితి ఒకేలా ఉందట. దీనికంతటికీ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుమారే కారణమని వారు ఆరోపిస్తున్నట్టు సమాచారం. ఎన్నో ఏళ్లగా టీఆర్‌ఎస్‌తో కలిసి సాగుతున్నవారు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చాలని ఉవ్విళ్లూరుతున్నారు ఎమ్మెల్యే ఆనంద్. ఉదయం 2 గంటలపాటు క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలు వింటున్నారు. అయితే ఇది నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులకు ఇబ్బందిగా మారిందట. సమస్యల పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లకుండా ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలకు పోతున్నారని ఆరోపిస్తున్నారు.
నియోజకవర్గంలో ఏం జరగాలన్నా తనకు చెప్పాలని, అనుమతి తీసుకోవాలని అధికారులకు, పార్టీ నేతలకు హుకుం జారీ చేశారట ఆనంద్. ప్రస్తుతం వికారాబాద్ టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే గ్రూపు, ఎంపీ గ్రూపు, మంత్రి గ్రూపు, సీనియర్ల గ్రూపు అని చాలానే ఉన్నాయి. ఒక గ్రూప్ నేతలకు మరో గ్రూప్ నేతలకు అస్సలు పడదు. ఈ వర్గపోరులో వెనకపడిపోతామని ఆందోళన చెందుతున్నారో ఏమో.. మొత్తం తన కనుసన్నల్లోనే జరగాలని కోరుతున్నారట ఆనంద్. ఈ సందర్భంగానే ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది పార్టీ నేతల విమర్శ.
ఇటీవల నియోజకవర్గంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు కాగా.. ఎంపీపీ, జెడ్పీటీసీ, మరికొందరు కలిసి వేదికముందు ఎమ్మెల్యే ఆనంద్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. అక్కడే ఉన్న ఎంపీ రంజీత్‌రెడ్డి కల్పించుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది. ఎన్ని నిరసనలు, ఆందోళనలు చేపట్టినా ఎమ్మెల్యే ఆనంద్ వైఖరిలో మార్పు రాలేదని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యే ఏ. చంద్రశేఖర్‌తో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కొందరు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు కూడా. త్వరలో మరికొందరు సైతం రాజీనామా చేస్తారని అనుకుంటున్నారు.
వికారాబాద్ టీఆర్‌ఎస్ పరిస్థితులపై పార్టీ పెద్దలకు కొందరు ఫిర్యాదు చేశారట. ఆనంద్ మాత్రం రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని మాత్రం పదే పదే చెబుతున్నారట. మరి.. పార్టీ పెద్దలు ఆనంద్‌లో మార్పు తీసుకొస్తారో.. లేక స్థానికంగా పార్టీని ప్రక్షాళన చేస్తారో చూడాలి.