చాలామంది వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఆ సంవత్సరం మొత్తం సమస్యలు వస్తాయి.. అంటుంటారు. అసలు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో ఎవరికైనా తెలుసా? దానికి పెద్దలు రెండు కారణాలను చెబుతారు. ఒకటి దైవ కోణం, మరోటి శాస్త్రీయ దృక్పథం.
దైవ కోణం ఏంటంటే.. భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతికి భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను తిన్న గణనాథుడు నడవటానికి కాస్త ఇబ్బంది పడుతూనే కైలాసానికి చేరుకుంటాడు. అయితే.. పరమ శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థలు చూసి నవ్వుతాడు. దీంతో వినాయకుడి కడుపులో ఉన్న ఉండ్రాళ్లు, కుడుములన్నీ కడుపు పగిలి బయటికి రావడంతో వినాయకుడు కిందపడిపోతాడు. తన కొడుకును పొట్టన పెట్టుకుంటావా అంటూ పార్వతీ దేవి చంద్రుడిని శపిస్తుంది. నిన్ను చూసిన వారు పాపాత్ములవుతారు.. అనేక సమస్యలను ఎదుర్కుంటారంటూ శపిస్తుంది.
అదేసమయంలో యజ్ఞం చేస్తున్న సప్తబుషులు చంద్రుడిని చూడటంతో బుషి భార్యలు అగ్నిదేవుడిచే నీలాపనిందలకు గురవుతారు. దీంతో వీరంతా బ్రహ్మను వెంటబెట్టుకొని కైలాసానికి చేరుకుంటారు. అక్కడ అచేతనంగా పడి ఉన్న వినాయకుడిని చూసిన బ్రహ్మదేవుడు వినాయకుడిని తిరిగి బతికిస్తాడు. పార్వతీ దేవి చంద్రుడిపై ఉన్న శాపాన్ని కూడా ఉపసంహరించుకోవాలని వారంతా ఆమెను కోరుతారు. కానీ.. పార్వతీ దేవీ మాత్రం శాపాన్ని ఉపసంహరించుకోకుండా.. ఏ రోజున చంద్రుడు గణేశుడిని చూసి నవ్వాడో.. అదే రోజు చంద్రుడిని చూసిన వాళ్లకు నీలాపనిందలు తప్పవు అంటూ చెప్పింది. అప్పటి నుంచి అదే కొనసాగుతూ వస్తున్నది. అందుకే భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ చంద్రుడిని చూసిన వారు ఈ శ్లోకం చదివితే నీలాపనిందల బారిన పడకుండా ఉండొచ్చని పెద్దల సూచన..
సింహ: ప్రసేన మవధీత్ సింహొజాంబవతా హత:
సుకుమారక మారోదీ:
తవ హ్యోషస్స:మంతక:
యేషా బాలక మరోదీ:
తవ హియేషా శమతక:
ఇక.. శాస్త్రీయ దృక్పథం ఏంటంటే… మామూలుగా వినాయక చవితి చాంద్రమానంలోని ఆరో నెలలో జరుగుతుంది. ఆరో నెల అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో వినాయక చవితి వస్తుంది. భాద్రపద శుద్ధ చవితి రోజును చంద్రకాలంగా పేర్కొంటారు. ఆ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వివిధ కోణాల్లో ఉంటాయి. అప్పుడు భూమిపై పడే చంద్రుడి కాంతి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. దీంతో చంద్రుడిని నేరుగా చూసిన వాళ్లపై పడే కాంతి వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయట. అందుకే ఆరోజున చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే.. చాలామంది ఇది ఓ మూఢనమ్మకమని.. అలాంటిదేమీ లేదని కొట్టి పారేస్తుంటారు.
చవితి చంద్రుడిని చూస్తే పరిహారం ఇలా చేసుకోండి