గతకొన్ని రోజులుగా అమరావతి పేరు చెప్పి రాష్ట్రంలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఈ క్రమంలో జగన్ మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారం గవర్నర్ చెంతకు చేరడంతో… చేసేదేమీ లేక లేఖలు రాస్తున్నాయి ప్రతిపక్షాలు! ఈ క్రమంలో అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని ఇంతకాలం వినిపించిన వాదనల స్థానే… విశాఖకు ఎందుకు వద్దు అనే మాటలు మొదలయ్యాయి!
రాజధాని విషయంలో నిజమో, ఆర్టిఫిషియలో… ఏదొక ధర్నా, దీక్ష జరుగుతూనే ఉంది! కానీ… విశాఖ వాసులు మాత్రం… తమకు వస్తోన్న అదృష్టాన్ని కాలదన్నొద్దని కానీ… విశాఖకు అనుకూలంగా మాట్లాడని స్థానిక నేతలపై ఫైరవ్వడం కానీ జరిగింది లేదు. దీంతో… విశాఖ వాసులకు ఏమైంది… వారి మౌనానికి అర్ధం ఏమిటి అనే ప్రశ్నలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే.. విశాఖ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం.. ఆ ప్రజల మనోభావాలు ప్రస్థావించే పనికి పూనుకోవడం లేదు.
ఈ క్రమంలో మనం చెప్పేలా చెబితే తప్ప విశాఖ ప్రజలకొస్తోన్న అదృష్టంపై నేతలు స్పందించరని ఫిక్సయ్యరో ఏమో కానీ… తాజాగా వారు కూడా స్థానిక నేతలపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు! ఇందులో భాగంగా… విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని రామకృష్ణపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన రామకృష్ణ బాబుకు తమ ఆగ్రహంతో షాకిచ్చారు విశాఖ వాసులు!
ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించడమే ఈ ఆగ్రహానికి కారణంగా వారు చెబుతున్నారు! ఇటీవల సీఎం జగన్‌మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేయడంతో అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేసిన తరుణంలో… విశాఖ కేంద్రంగా గెలుపొందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ అధినేత చంద్రబాబు బాటలో నడిచి విశాఖ వాసుల అదృష్టాన్ని కాలదన్నుతున్నారని చెబుతున్నారట!
దీంతో… ఇంతకాలం సైలట్ గా ఉన్న విశాఖ వాసుల్లో కూడా కదలిక వచ్చిందని.. ఇది ఆరంభం మాత్రమే అని.. రాష్ట్ర రాజధానుల్లో ఒకటిగా అవకాశం సంపాదించుకున్న విశాఖ అదృష్టాన్ని ఎవరు కాలదన్నే ప్రయత్నం చేసినా.. విశాఖ వాసులు ఎదురుతిరిగే అవకాశాలు మొదలైపోయాయని అంటున్నారు!
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… అమరావతిలో మొత్తం రాజధాని ఉండదని జగన్ చెప్పడం లేదు! అలా అని విశాఖకు మొత్తం రాజధానికి తీసుకుపోతున్నామని ప్రకటించడం లేదు! పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా… మూడు ప్రాంతాల అభివృద్ధిలో మొదటి అడుగుగా, మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు! అందులో భాగంగా ఆలోచిస్తే… విశాఖ ప్రజల ఆగ్రహంలో న్యాయముంది.. జగన్ ఆలోచనలోనూ అర్ధముంది!!