ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ఎట్టకేలకు లాభాల బాటలో నడుస్తుంది. గత ఆరు సంవత్సరాల నుంచి నష్టల్లో ఉన్న విశాఖ ఉక్కు తాజా గా లాభాల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని విశాఖ స్టీల్ ప్లాంటు సీఎండీ అతుల్ భట్ వెల్లడించారు. ఈ ఏడాది అమ్మకాల్లో 57 శాతం వృద్ధి నమోదు అయిందని ప్రకటించారు. 2021 – 22 లో పన్నులకు ముందు రూ. 835 కోట్ల లాభం వచ్చిందని ప్రకటించారు. 2020 – 21 ఏడాదిలో మొత్తం అమ్మకాలు.. రూ. 17,978 కోట్లు జరిగాయని తెలిపారు. కాగ 2021 – 22 ఏడాదిలో రూ. 28,245 కోట్లు అమ్మకాలు జరిగాయని వెల్లడించారు.
దీని వల్ల ఈ ఏడాది రూ. 835 కోట్లు లాభం వచ్చిందని తెలిపారు. రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లతో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించామని విశాఖ ఉక్కు సీఎండీ అతుల్ భట్ తెలిపారు. విశాఖ ఉక్కు సిబ్బంది, కార్మికులు, అధికారులు అందరి కృషి వల్లే.. ఈ లాభాలు సాధించామని తెలిపారు. కాగ గతంలో విశాఖ ఉక్కు.. నష్టాల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
దీంతో విశాఖ ఉక్కును ప్రయివేటు పరం చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు జరిగాయి. అయినా.. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అయితే ప్రస్తుతం విశాఖ ఉక్కు లాభాల బాటలో పడటంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.