ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో దాని మాతృసంస్థ వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. రెండు దఫాలుగా మొత్తం 1.2 బిలియన్ డాలర్లను వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వాల్‌మార్ట్ అంత భారీ మొత్తం పెట్టుబడి పెట్టడం శుభ పరిణామమని అన్నారు. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫ్లిప్‌కార్ట్ ముందుకు సాగుతుందని తెలిపారు.
మరోవైపు వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈవో మెక్ కెన్నా మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియాగా భారతదేశం రూపుదిద్దుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఎంతో మంది చిరువ్యాపారులకు ఉపాధి కల్పిస్తూనే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తువులను విక్రయిస్తుందని తెలిపారు. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం తన సైట్‌లో 80కి పైగా విభాగాల్లో మొత్తం 150 మిలియన్లకు పైగా వస్తువులను విక్రయిస్తోంది. అందులో వినియోగదారులకు క్యాష్ ఆన్ డెలివరీ, నో కాస్ట్ ఈఎంఐ తదితర అనేక సదుపాయాలను అందిస్తోంది.
కాగా తాజా పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ విలువ 24.9 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించాక.. 2018లో వాల్‌మార్ట్ అందులో 16 బిలియన్ డాలర్లతో ప్రధాన వాటాను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం ఫోన్ పే, ఫ్యాషన్ యాప్ మింత్రా, ఈ-కార్ట్ లాజిస్టిక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.