కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో మంగళవారం (14-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,07,645కు చేరుకుంది. మొత్తం 23,727 మంది చనిపోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో ఇప్పటికీ అమెరికాయే మొదటి స్థానంలో ఉంది. అక్కడ మొత్తం 18,84,967 కేసులు నమోదయ్యాయి.
2. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్ సంస్థ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడప్పుడే పరిస్థితులు మెరుగయ్యే అవకాశం లేదని ఆ సంస్థ పేర్కొంది. జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా ముప్పు ఇంకా పెరుగుతుందని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడికి అనేక దేశాలు తప్పుడు విధానాలను అవలంబిస్తున్నాయని అసంతృప్తిని వ్యక్తం చేసింది.
3. ఢిల్లీలో ఇప్పటికే కోవిడ్ ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఓ ప్లాస్మా బ్యాంక్‌ను సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఓపెన్ చేయగా.. మంగళవారం మరో ప్లాస్మా బ్యాంకును ఆయన ప్రారంభించారు. లోక్‌నాయక్ హాస్పిటల్‌లో ఈ సెంటర్ ఏర్పాటైంది. ఇందులో ప్లాస్మా తీసుకునేందుకు ముగ్గురు కౌన్సిలర్లను నియమించారు.
4. ఫార్మా కంపెనీ బయోకాన్.. ఐటోలిజుమాబ్ ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేయనుంది. దీనికి గాను డ్రగ్ కంట్రోల్ బోర్డు నుంచి ఆ సంస్థకు అనుమతులు లభించాయి. ఈ మెడిసిన్ ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.8వేలకు విక్రయించనున్నారు. కోవిడ్ ఎమర్జెన్సీ పేషెంట్లకు ఈ మెడిసిన్‌ను వాడవచ్చు.
5. తెలంగాణలో గత 10 రోజులుగా కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచినట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 36,221 కరోనా కేసులు నమోదయ్యాయని, రికవరీ రేటు 99 శాతంగా ఉందన్నారు.
6. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు గాను మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని స్కూళ్లు ఆ నియమ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవచ్చు. ఇక విద్యార్థులు నిత్యం ఎంత సేపు కంప్యూటర్ తెరల ముందు ఉండాలో కూడా ఆ శాఖ తెలిపింది.
7. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ కోవిడ్ కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాధిత కుటుంబాలకు రూ.15వేలు ఇవ్వనున్నారు. కాగా కరోనా నుంచి కోలుకున్న వారికి ఏపీలో రూ.2వేలు ఇస్తున్న విషయం విదితమే.
8. హైదరాబాద్‌లో కరోనా కట్టడికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు గాను జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 8 మంది ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. వారిలో ముగ్గురు ఐఏఎస్‌లు కాగా, 5 మంది అడిషనల్ కమిషనర్లు. వీరు కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రత్యేక చర్యలు చేపడుతారు.
9. బీహార్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించనున్నారు. కేవలం అత్యవసర సర్వీసులు, వ్యవసాయ పనులు, నిర్మాణ, అనుబంధ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఉంటాయి.
10. కరోనా నేపథ్యంలో ఎస్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడ ఉన్నా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా ఎస్‌బీఐ సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు కావల్సిన మౌలిక వసతులను త్వరలోనే ఎస్‌బీఐ సమకూర్చుకోనుంది. దీంతో తమకు రూ.1వేయి కోట్ల వరకు ఆదా అవుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది.