శాంతి పేరిట యుద్ధం చేయాలనుకుంటున్న రష్యాకు, రష్యాను నిలువరించి తమ దారి తాము చూసుకోవాలనుకుంటున్న ఉక్రెయిన్ కు మధ్య పెద్ద అగాధమే నెలకొంది.దీంతో వేర్పాటు వాదాలకు రష్యా మద్దతు ఇస్తోంది.వాటికి స్వతంత్రం ప్రసాదించి కొత్త చర్చకు తెరలేపింది.ప్రపంచ దేశాలు వద్దంటున్నా కూడా యుద్ధం ఒక అనివార్య క్రీడ అని భావిస్తూ ముందుకు వెళ్తూ, పౌర జీవనంను స్తంభింపజేస్తూ అస్తవ్యస్తలను అనివార్యంగా అందిస్తోంది.రష్యా చర్యలను అటు బ్రిటన్ కానీ ఇటు అమెరికా కానీ ఖండిస్తున్నాయి.ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమణలను బ్రిటన్ సైతం ధ్రువీకరిస్తోంది.
అంతా అనుకున్న దాని కన్నా భిన్నంగా ఇవాళ రష్యా సేనలు ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయి.అంతా అనుకున్న దాని కన్నా భిన్నంగా శాంతి స్థానంలో యుద్ధ స్థావరాల నిర్మాణం,దాడులు,అప్పటిదాకా ఉన్న నియమాలకు విరుద్ధంగా సాగిపోతున్నాయి. ఉక్రెయిన్ పై దాడి చేయాలనుకున్న రష్యా నిర్ణయం నేపథ్యంలో ఆ ప్రాంతం అట్టుడికి పోతోంది.ప్రపంచం పుతిన్ పై తిరుగుబాటు చేస్తోంది.పుతిన్ మాత్రం రష్యా అధ్యక్ష స్థానంలో ఉంటూ విచక్షణ మరిచి ఉక్రెయిన్ పై దాడులు చేయిస్తున్నారు. ఆ విధంగా ఆయన దేశాన్ని శాంతిని తిరోగమన దిశలో నడుపుతున్నారు అన్న అభియోగాలను అత్యంత సులువుగానే మోస్తున్నారు. మరోవైపు ఇది మా దేశం మేం ఎవ్వరికీ భయపడేదే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్ స్కీ అంటున్నారు.
మరోవైపు ఉక్రెయిన్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో భారత్ లో కూడా అలజడులు రేగాయి.అక్కడున్న విద్యార్థులు వెనక్కు వచ్చేయాలన్న ఆదేశాలను కేంద్రం జారీ చేస్తోంది.రష్యా ఏకపక్ష నిర్ణయంలో భాగంగా ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికా ఉలిక్కి పడింది. రష్యా అధినేత పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి గతంలో ఓ సారి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి.కానీ అవేవీ ఫలించలేదు.తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్ చేసి ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
మరోవైపు రష్యా చర్యలను అమెరికా తిప్పికొడుతోంది.ఇవన్నీ భయానక చర్యలేనని అభివర్ణిస్తోంది.తాజా పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం అయి,అక్కడి పరిస్థితులను సమీక్షించింది.తూర్పు ఉక్రెయిన్ లో శాంతి పేరిట రష్యా చేస్తున్న యుద్ధాన్ని తప్పుపడుతోంది.మరోవైపు ఉక్రెయిన్ లో వేర్పాటు వాదులు ఉన్న ప్రాంతాలను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించింది. వాటి సరిహద్దులు గతంలో ఎలా ఉన్నాయో అదే విధంగా ఉంటాయని తేల్చింది.పరస్పర వాద సంవాదాలు ఓ వైపు నడుస్తుండగానే మరోవైపు రష్యా మాత్రం యుద్ధం చేసి తన పంతం నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో ఉంది అన్నది ఇవాళ్టి నిర్థారణ.ఇదే దశలో అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను సైతం ఉల్లంఘిస్తోందని బ్రిటన్ సైతం ఆరోపిస్తోంది.అయినా సరే! వీటిని వినిపించుకునే స్థితిలో రష్యా లేదు.