కార్పోరేషన్ ఎన్నికల‌ ముంగిట ఆకుల,ఆదిరెడ్డి మధ్య ముదిరిన వార్

-

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. త్వరలో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో‌ వైసీపీ,టీడీపీ‌ నేతలు మాటల దాడి మొదలెట్టేశారు. వైసీపీ రాజమండ్రి‌ అర్బన్ ఇంచార్జ్ ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే‌ ఆదిరెడ్డి‌ భవాని కుటుంబం పై విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న వైసీపీ కార్యాలయంలో సీఐలతో అధికారిక సమీక్ష నిర్వహించి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే భవాని భర్త వాసు పై తీవ్రస్థాయిలో‌ విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసు చిట్టిల వ్యాపారం చేస్తు పదవిని అడ్డం పెట్టుకుని యువతని నాశనం చేస్తున్నారని.. భవాని ఎమ్మెల్యేగా గెలిపించి రాజమండ్రి ప్రజలు బాధపడుతున్నారన్నారు. రాజమండ్రిలో‌ శాంతి భద్రతలు కరువయ్యాయని ఒకే నెలలో ఐదు మర్డర్లు జరిగాయన్నారు. ఇప్పటికే రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఆదిరెడ్డి అప్పారావుల మధ్య గ్రూప్‌ వార్‌ నడుస్తోంది. గోరంట్ల వర్గం సిటీ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఆదిరెడ్డి కుటుంబం అంతా తానై వ్యవహరిస్తుంది.

రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముందు నుంచి టీడీపీదే హవా. పార్టీ బలంగానే ఉందని నేతలు భావిస్తున్నారు. ఆదిరెడ్డి భవానీ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడంతో కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ అదే రిపీట్‌ చేయాలని అనుకుంటున్నారు. అయితే అధికార పార్టీని ఎదుర్కొని ఆదిరెడ్డి కుటుంబం ఏ మేరకు పాగా వేస్తుందన్నది ప్రశ్నగా ఉంది. ఇదే సమయంలో గోరంట్ల వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారట. అయితే టికెట్‌ హామీ ఇస్తేనే గోడ దూకుతామని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.

ఇక వైసీపీ విషయానికి వస్తే ఎంపీ మార్గాని భరత్‌ ఆశీస్సులు ఉన్న కొత్త టీమ్‌ రంగంలోకి దిగింది. జనసేన నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కోఆర్డినేటర్‌గా వచ్చారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి టీడీపీ పై దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే భర్త వాసు పై వ్యక్తిగత విమర్షలతో కార్పోరేషన్ ఎన్నికల‌వేళ హీట్ పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news