ఇన్నాళ్లు హైదరాబాద్ కే పరిమితమైన డ్రగ్స్ దందా ప్రస్తుతం జిల్లాలకు వ్యాపిస్తోంది. తాజాగా వరంగల్ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ అమ్ముతూ, వాటిని సేవిస్తూ పలువురు పట్టుబడ్డారు. వరంగల్ నగర పరిధిలో తొలిసారిగా డ్రగ్స్ దందా బయటపడింది. కొకైన్, చరస్ తో పాటు ఆరు రకాల డ్రగ్స్ ను అమ్ముతూ.. మరో నలుగురు యువకులు వాటిని సేవిస్తూ వరంగల్ టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసుకు పట్టుబడ్డారు. ఈ ఘటనలో అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా చేసే పరికరం స్వాధీనం చేసుకున్నారు. హుక్కా కూజాతో పాటు దానికి వినియోగించే సామగ్రి మరియు ఆరు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో శివా, రోహన్ బీటెక్ చదువుతున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. పక్కాసమాచారంతో పోలీసులు ఓ లాడ్జిపై రైడ్ చేశారని తెలిపారు. పోలీసులకు దొరికిన వారంతా గత మూడేళ్ల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వెల్లడైందని వివరించారు. దాడుల్లో పట్టుబడ్డ రోహన్ తరుచూ గోవాకు వెళ్లి నైజీరియా దేశానికి చెందిన జాక్ మరియు కాల్ జాఫర్లతో వున్న పరిచయంతో వారి వద్ద నుండి కొకైన్, చరస్ మరియు ఇతర రకాల మత్తు పదార్థాలను కొనుగోలు చేసేవాడని వెల్లడించారు.