ఒకప్పుడు థియేటర్ రంగం, డిస్ట్రిబ్యూటర్ ఫీల్డ్ ఇలాంటివన్నీ పెద్ద నిర్మాతల చేతిలోనే ఉండేవి. ఇంకా చెప్పాలంటే వారి మాటే శాసనం అయి ఉండేది. కరోనా తరువాత సురేశ్ ప్రొడక్షన్స్ మెల్లగా థియేటర్లను వదిలించుకునే మొదలుపెట్టింది. వీలుంటే ఓటీటీకి కంటెంట్ రిలీజ్ చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సురేశ్ బాబు. కానీ విరాట పర్వం విషయంలో డైరెక్టర్ వేణు ఊడుగుల పట్టుదల కారణంగానే ఆ సినిమా ఒక్కటే థియేటర్ కు రానుంది. ఆవిధంగా జూలై ఒకటిన విడుదల కానుంది.
ఒకప్పుడు పెద్ద నిర్మాతలుగా పేరున్న వారంతా సైడ్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పేరిట నిరంజన్ రెడ్డి తెరపైకి వచ్చినా ఆయన కూడా నిలదొక్కుకునేలా లేరు అని తేలిపోయింది. అందుకు ఆచార్య సినిమా అపజయం కావడమే ప్రధాన కారణం. ఈ సినిమా బడ్జెట్ రెమ్యునరేషన్లతో కలుపుకుని 170 కోట్ల రూపాయలు అని తేలింది. కానీ సినిమాకు సంబంధించి డబ్బులేవీ వెనక్కు రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆచార్య సినిమా కొనుగోలు చేసి నష్టపోయిన వారికి కొరటాల తనవంతు సాయం చేస్తూనే డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనకు చెందిన నమ్మకస్తులను బాగానే ఎంకరేజ్ చేస్తున్నాడు.
దిల్ రాజుతో ఉన్న గొడవల కారణంగానే కొరటాల శివ ఈ విధంగా చేస్తున్నాడు అని కూడా తెలుస్తోంది. వీటిపై ఎటువంటి క్లారిఫికేషన్ లేకపోయినా రానున్న కాలంలో దిల్ రాజుకు దీటుగా ఇటుగా వచ్చే కుర్ర ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా మందే ఉన్నారు. కనుక దిల్ రాజు కూడా సురేశ్ బాబు లానే త్వరలోనే ఈ రంగం నుంచి నిష్క్రమించడమో లేదా తనదైన ఏకఛత్రాధిపత్యం వదులుకోవడమో అన్నది చేయక తప్పదు.
ఈ తరుణాన తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొన్ని విభేదాలు వస్తున్నాయి. ఇవే ఇప్పుడు వార్తలకు కారణం అవుతున్నాయి. వార్తలు అని రాసే కన్నా వివాదాలకు విభేదాలకు కారణం అవుతున్నాయి అని రాయడం మేలు. ఇంతకాలం ఏకఛత్రాధిపత్యంతో సినిమా వ్యాపారం చేసిన దిల్ రాజుకు దీటుగా వరంగల్ శీను అనే డిస్ట్రిబ్యూటర్ తెరపైకి రావడమే కాదు కొరటాల శివ అండతో బాగానే రాణిస్తున్నాడు. ఆచార్య సినిమా విషయమై బాగా ఆఫర్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు అని తెలుస్తోంది. అయినా కూడా ఆయన వెనకడుగు వేయడం లేదు. సర్కారు వారి పాట డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా తీసుకున్నాడు. ఆ విధంగా ఇంత కాలం దిల్ రాజు హవా చెల్లిందని సంబరపడిపోతున్న ఓ వర్గంకు ఇప్పుడు చెక్ పడింది.