పాలన బాగుంటే అంతా బాగుంటుంది అన్న నానుడిని నిజం చేయాలన్న తాపత్రయం నాయకుల్లో ఉండాలి. పాలన బాగుంటే దేశం బాగుంటుంది అన్న సోయి ఒకటి నాయకులకు ఉంటే ఇంకా మంచి ఫలితం ఒకటి భవిష్య కాలంలో పలకరిస్తుంది అన్న తపన ఒకటి నాయకులకు ఉండాలి. ఇవేవీ లేకుండా నేను చూసుకుంటాను మీరు మాట్లాడండి అని అధినాయకత్వం అంటే చేదు నిజాలు వెల్లడిలోకి రావు. మంచి అన్నది కొంచెమే అయి ఉంటుంది. ఆ విధంగా కష్టపడి తెచ్చుకున్న అధికారం ఎందుకూ పనికి రాకుండానే పోతుంది. ఇదే ఇప్పుడు ఆంధ్రాలోనూ నడిచే అవకాశాలున్నాయి అని అంటున్నారు టీడీపీ నాయకులు. మరియు జగన్ ను ఫక్తు గా వ్యతిరేకించే కొందరు. ఎలానో చూద్దాం.
మే పది నుంచి గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే కనుక సజావుగా జరిగితే అధికార పార్టీకి సంబంధించిన అనేక నిజాలు వెలుగులోకి వస్తాయి. యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న విధంగానే యాభై శాతం మందికి పైగా ఎమ్మెల్యేలు అస్సలు నియోజకవర్గాల ముఖమే చూడడం లేదు. ఇంకొందరు పదవులను వ్యాపారాలకు అనుగుణంగా వాడుకుని ఉన్నంతలో ఎదిగిపోతున్నారు. ఆ విధంగా వైసీపీ హెల్ప్ కాలేని ప్రజాప్రతినిధులను ఏమనాలి.. పోనీ ప్రజలకు వారి భావోద్వేగాలకు పనికి రాని వాళ్లను ఏమనాలి.. ఎప్పుడో ఏడాదికో సారి ఇటుగా వచ్చే నాయకులను ఏమనాలి.. వీరంతా పొలిటికల్ టూరిస్టులే ! ఇందులో ప్రజల తప్పిదాలు కూడా ఉన్నాయి. అది వేరే చర్చ.. ఓ సారి ఎన్నుకున్నాక ఐదేళ్లూ భరించాల్సిందే !
ఇప్పుడున్న లెక్క ప్రకారం ఆంధ్రాలో కనీస స్థానాలు దక్కించుకోవాలంటే వైసీపీలో అనూహ్య మార్పులు రావాలి. అందుకు తగ్గ కార్యాచరణ కూడా షురూ కావాలి. కానీ ఇప్పుడు ఆ విధంగా జరిగే ఛాన్స్ లేదు. లేదు కదా అని సర్దుకుపోకండి. మనుషులను అతి దుర్మార్గంగా తిట్టే మంత్రులు ఉన్నారు కనుక మళ్లీ అధికారం తమదే అని అనునే వాళ్లను మనం కొట్టిపారేయలేం అని అంటోంది టీడీపీ. ఓ విధంగా ఇలాంటి తప్పిదాలు కానీ లేదా ప్రజలను పట్టించుకోని వైనాలు కానీ గతంలోనూ ఉన్నాయి.
కానీ పూర్తిగా వచ్చే ఆదాయం అంతా సంక్షేమానికి వెచ్చించి, మేం డబ్బులు పంచుతున్నాం కదా కనుక ఎందుకు ఓటెయ్యరు అని చెప్పడంలో మాత్రం అర్థం లేదు. కనుక డబ్బులు పంచితే ఓట్లే వస్తాయి అనుకుంటే గతంలో పసుపు కుంకుమ పేరిట డబ్బులు పంచిన టీడీపీ ఏం కావాలి. ఆ మాటకు వస్తే ఆ రోజు టీడీపీలో కూడా పొలిటికల్ టూరిస్టులు ఉన్నారు. అందుకే వాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడు టీడీపీలో కూడా వాళ్లే ఉన్నారు. వాళ్లు కూడా తమని తాము మార్చుకోకుంటే మంచి ఫలితాలు వచ్చే కాలంలో అందుకోవడం కష్టమే!