పోనీలే పాపం.. పనిమనిషి కొడుకే కదా.. కాస్త చనువిస్తే.. ఏకంగా తల్లి పని చేసే ఇంటికే కన్నమేశాడో కుర్రాడు. ఏకంగా పాతిక లక్షల రూపాయలు కొట్టేశాడు. దీంతో ఆ యజమాని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
రాజేంద్రనగర్ నగర్ పరిధిలోని బండ్లగూడ శారదానగర్‌లో నివాసం ఉండే గోవర్ధన్ రెడ్డి
స్టీల్, సిమెంట్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారస్తుడు కావడంతో ఆయన దగ్గర ఎప్పుడూ లక్షల్లో నగదు ఉంటుంది. దాన్ని ఇంటి బీరువాలోనే ఉంచుతుంటారు. ఆ ఇంటి వాచ్ మెన్ భార్య అదే ఇంట్లో పని మనిషిగా ఉంటోంది. తల్లితో పాటు ఆమె కుమారుడు కూడా అప్పుడప్పుడు తల్లితోపాటు యజమాని ఇంట్లోకి వస్తుంటాడు.
పోనీ పనిమనిషి కొడుకే కదా అని గోవర్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు పెద్దగా అభ్యంతర పెట్టేవారు కాదు. ఇదే వారి పాలిట శాపమైంది. ఇంట్లోకి తరచూ వస్తూ.. ఎవరు ఎక్కడ ఉంటున్నారు.. డబ్బు ఎక్కడ దాస్తున్నారు అనే విషయాలు పసిగట్టాడా కొడుకు. ఓ రోజు గోవర్థన్ రెడ్డి పాతిక లక్షల నగదు బీరువాలో దాయడం చూసిన ఆ కుర్రాడు యజమాని బయటకు వెళ్లగానే.. ఆ నగదు తీసుకుని ఉడాయించాడు.
ఆ పాతిక లక్షలు నగదు తీసుకొని స్థానికంగా ఉండే అతని బాబాయ్ దగ్గరకు వెళ్లి ఇచ్చాడు. ఈ నెల 8న బీరువా తెరిచేందుకు యజమాని ప్రయత్నించగా తాళంచెవి కనిపించలేదు. అనుమానంతో బీరువాను పగలగొట్టి చూస్తే అందులో నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అదేరోజు రాజేంద్రనగర్ ఠాణాలో నగదు పోయినట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
అనుమానంతో వాచ్ మెన్ కొడుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. నాలుగు తగిలించే సరికి ఆ కుర్రాడు విషయమంతా కక్కేశాడు. అదృష్టం ఏంటంటే.. ఆ సొమ్ముతో చాలావరకూ ఖర్చు చేయలేదు. అతని వద్ద నుంచి రూ.24.70 లక్షలు స్వాధీనం చేసుకొని యజమానికి ఇచ్చేశారు పోలీసులు. ఆ కుర్రాడిని బాలనేరస్తుల గృహానికి తరలించారు.