రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు, వారి పంటల వివరాలు వెంటనే నమోదు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2న కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మంచినీరు, విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు కలగకూడదని అధికారులకు సూచించారు. వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యుల్ని అందుబాటులో ఉంచాలన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయరు మానేరు డ్యాం నుంచి కాకతీయ ద్వారా దిగువకు నీటిని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 500 క్యూసెక్కుల నుంచి 2000 క్యూసెక్కుల వరకు నీటి విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో దిగువన ఉన్న రైతులకు ఉపయోగపడుతుందని నీటిని విడుదల చేస్తున్నామన్నారు. లోయర్ మానేర్ డ్యాంలో ప్రస్తుతానికి 23 టీఎంసీల నీరు ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం దిగువ ఎల్ఎండీ నుంచి 9లక్షల ఎకరాలకు నీటిని రిలీజ్ చేశామని ఆయన అన్నారు.