కరోనా వైరస్ వల్ల జనాలు ఓ వైపు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కొందరు పనీ పాటా లేని వెధవలు వాట్సాప్‌లో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఓ వైపు దేశం మొత్తం లాక్‌డౌన్ అయ్యింది. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రం నకిలీ వార్తలతో జనాలను మరింత బెంబేలెత్తిస్తున్నారు.
కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే.. ఫలానా పని చేయాలంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా వైరల్ అవుతున్నది.. వేప చెట్టుకు నీళ్లు పోయడం.. ఇద్దరు కుమారులు ఉన్న తల్లులు ఒక కుమారుడ ఉన్న తల్లి ఇంటికి వెళ్లి వారి ఇంటి బోరు నుంచి నీరు తీసుకుని అక్కడే ఉండే వేప చెట్టుకు నీళ్లు పోయాలట. ఇలా వారు 5 మంది ఇళ్లకు వెళ్లి నీరు పోస్తే కరోనా రాదని వాట్సాప్‌లో ప్రచారం సాగుతోంది. దీంతో అది నిజమే అని నమ్మిన కొందరు అలాగే చేస్తున్నారు.
అయితే అలా చేయడం నిజంగా మూఢనమ్మకమే అని విజ్ఞానవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్‌ను నాశనం చేసేందుకు ప్రస్తుతం ఎలాంటి మందు లేదని, కనుక అనవసరంగా అందరూ ఇండ్లకు తిరుగుతూ ఆ వైరస్‌ను కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా ఉంటే కరోనా దానంతట అదే మాయమవుతుందని అంటున్నారు..!