ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్(covid) మూడో వేవ్ ప్రారంభం అయిందని, మనం ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియెంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందువల్ల ఇది కోవిడ్ 3వ వేవ్ వచ్చిందని చెప్పేందుకు సంకేతమని అన్నారు. ఈ మేరకు గురువారం టెడ్రోస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
దురదృష్టవశాత్తూ మనం ఇప్పుడు కోవిడ్ మూడవ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని టెడ్రోస్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో సామాజిక చైతన్యం పెరిగినప్పటికీ డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం, కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనను కలిగిస్తుందన్నారు. కరోనా వైరస్ వేగంగా మారుతుందని, దీంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ ఇప్పుడు 111 కి పైగా దేశాలలో ఉందని, దీన్ని వీలైనంత త్వరగా అంతం చేయాలని, లేదంటే విపరీతమైన పరిణామాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా వరుసగా నాలుగో వారం కూడా రోజువారీగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు.
కాగా ప్రపంచంలో ఇప్పటికీ ఇంకా అనేక దేశాలకు టీకాలు అసలు చేరలేదని, అయితే సెప్టెంబరు నాటికి ప్రతి దేశ జనాభాలో కనీసం 10 శాతం మందికి, 2021 చివరి నాటికి కనీసం 40 శాతానికి, 2022 మధ్య నాటికి కనీసం 70 శాతం మందికి టీకాలు వేయాలని టెడ్రోస్ పునరుద్ఘాటించారు. కేవలం టీకాలు వేయడం ద్వారానే వైరస్‌ను అడ్డుకోవచ్చన్నారు.