రైతులను కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకున్నామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం 5 పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. రైతుబంధుతో ఎకరానికి రూ.10వేలు ఇచ్చామనీ చెప్పారు. 24గంటల నాణ్యమైన కరెంట్, రైతు బీమా కింద రూ.5లక్షలు, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేదని ఆయన అన్నారు.ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా ఉండాలి అని కేసిఆర్ అన్నారు.
ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా, ధైర్యం ఉండాలని ,తమకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. ప్రతి సభలోనూ ఇదే విషయాన్ని తాను ప్రజలకు గుర్తు చేస్తుంటానని ,ప్రభుత్వాలు మారుతుంటాయని కేసిఆర్ అన్నారు.