గుడ్డి కన్ను మూసినా, తెరిచినా ఒక్కటే.. బీజేపీకి ఓటు వేసినా, వేయకపోయినా ఒక్కటే అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో మాట్లాడారు కేసీఆర్. పదేళ్లలో ప్రజల కోసం బీజేపీ ఏం చేసింది అని ప్రశ్నించారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. ఇప్పుడు రైతుల గోస చూసి బాధ కలుగుతుందన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి ఏం తక్కువ చేశాం. రంజిత్ రెడ్డి పొద్దు తిరుగుడు పువ్వా..? అని ప్రశ్నించారు.
ముఖ్యంగా తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులను కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం 5 పథకాలు తీసుకొచ్చామన్నారు. రైతుబంధుతో ఎకరానికి రూ.10వేలు ఇచ్చామన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్, రైతు బీమా కింద రూ.5లక్షలు, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేదని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలంటే.. తాము పెట్టమని తెగేసి చెప్పామన్నారు. మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి 30వేల కోట్ల నష్టం వచ్చిందని.. కానీ రైతుల క్షేమం కోసం మీటర్లు పెట్టలేదన్నారు. బీజేపీకి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు కేసీఆర్.