ఈ సంవత్సరం చివర్లో అక్టోబర్-నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి సిద్ధం అవుతున్నాయి.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ(ఎస్) పార్టీలు కలిసి పోటీ చేస్తాయని శరద్ పవార్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అనుకుంటోంది. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్),శివసేన్(షిండే) పార్టీలు ఉన్నాయి.
మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే కలిపి పోరాడుతామని తెలిపారు.సీట్ల కేటాయింపుపై త్వరలో చర్చిస్తామని, తమకు మూడు నెలల సమయం ఉందని అన్నారు. ప్రతిపక్ష కూటమికి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మంచి ఊపును ఇచ్చాయి. 48 ఎంపీ స్థానాలతో ఉత్తరప్రదేశ్ తర్వాత కీలకంగా ఉన్న మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 31 స్థానాలను సొంతం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, శివసేన(ఉద్ధవ్) 09, ఎన్సీపీ(శరద్ పవార్) 08 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీయే కూటమి కేవలం 17 చోట్ల మాత్రమే గెలిచింది.