పుల్వామాలో భారత జవాన్లపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత వైమానిక దళం ఇవాళ పాక్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి 300కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను దేశ వ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే భారత్ జరిపిన ఈ దాడితో పాక్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆ దేశానికి చెందిన విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్పందిస్తూ.. భారత్‌పై తాము దాడి చేస్తామని, సరైన సమయంలో దాడి ఆరంభిస్తామని అన్నారు.
భారత్ చేసిన చర్యకు తమకు స్పందించే హక్కు ఉందని, భారత్ చేసిన పనికి తగిన విధంగా ప్రతిస్పందిస్తామని షా మహ్మద్ ఖురేషీ తెలిపారు. భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని తెలిపారు. భారత్ చేపట్టిన దాడులపై అత్యున్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన ఖురేషీ అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ ఈ రోజు దురాక్రమణకు పాల్పడిందని, నియంత్రణ రేఖ దాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు.
భారత్ చేసిన పనికి తమకు ప్రతిస్పందించే హక్కు ఉందని ఖురేషీ తెలిపారు. ఇందుకు గాను త్వరలో తగిన రీతిలో సమాధానం ఇస్తామన్నారు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొందని, అయినప్పటికీ తాము భారత్ చర్యలకు భయపడడం లేదని అన్నారు. ఈ క్రమంలో సమావేశం గురించిన వివరాలను ఆయన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వివరించారు. భారత్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అధికార పార్టీ మళ్లీ గెలించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడిందని పాక్ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ ఆరోపణలు చేశారు. అందుకే యుద్ధ వాతావరణ పరిస్థితులను భారత్ సృష్టిస్తుందని ఆయన అన్నారు.