మహిళలు సమాజానికి వెన్నెముక లాంటి వారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇన్చార్జి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం రేపల్లె పట్టణంలో ఎం.సీ.ఏ హాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమెరికాలో 15 వేల మంది మహిళలు కొన్ని నెలల పాటు పోరాడిన ఫలితంగా మహిళలు మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మహిళలు పురుషుల కంటే దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు పొలం పనులు చేసుకునే స్థాయి నుంచి కార్పొరేట్ ఆఫీసులు నిర్వహించే స్థాయికి చేరారని, రాష్ట్రంలో వివక్షత లేని సమాజం నిర్మాణానికి మహిళలు కృషి చేయాలన్నారు.
సీఎం చంద్రబాబు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించి వారి జీవితాలను చక్కగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నవంబర్ నుంచి 80 లక్షల మంది మహిళలకు 35 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించడానికి లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని వెలడించారు.