కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సీఎం ఆలోచన అభినందనీయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత దశాబ్ద కాలంలో డ్వాక్రా సంఘాల గురించి పూర్తిగా మరిచిపోయాం అని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు.
2014 నుంచి దశాబ్ద కాలం మహిళల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందని తెలిపారు. మహిళల గురించి అసెంబ్లీలో మాట్లాడుదామంటే సమయం కూడా ఇచ్చేవారు కాదన్నారు. 10 సంవత్సరాల బడ్జెట్ ఆదాయం, అప్పులను పందికొక్కుల్లా తిన్నారు తప్ప.. ఏమాత్రం మహిళలకు చేయలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మాకు మేలు జరుగుతుందని మీరు ఆశించినట్టుగానే మేలు జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు రూ.20వేల కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ వాల్లు నవ్వుతూ మాట్లాడారు. నవ్విన బుద్ది చెప్పేటట్టు రూ.21వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చిందని తెలిపారు.