వీకెండ్ లాక్‌డౌన్‌పై హై కోర్టు ఆదేశాలు.. పరిశీలిస్తామన్న సీఎస్

-

తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై మే 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలపై తగ్గడంపై హై కోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్త చేసింది. రోజుకు కనీసం లక్ష పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాగా అన్ని జిల్లాల్లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. వివాహాలు, అంత్యక్రియలపై ఆంక్షలు విధించాలని దీనికి సంబంధించి 24 గంటల్లో జీవో ఇవ్వాలని ఆదేశించింది. ఇక రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్నారు. బీఆర్కే భ‌వ‌న్‌లో సీఎస్ మీడియాతో మాట్లాడారు. క‌రోనాపై సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారని అన్నారు. రాష్ర్టంలో మందులు, ఆక్సిజ‌న్‌తో పాటు నిత్యావ‌స‌రాల‌ కొర‌త లేదని తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 62 వేల ఆక్సిజ‌న్ బెడ్లు ఉన్నాయని అయితే ఆక్సిజ‌న్ బెడ్స్ సంఖ్య పెంచాల‌ని సీఎం ఆదేశించారని అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎస్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారని సీఎస్ తెలిపారు. తెలంగాణ‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ ఉండ‌ద‌న్న సీఎస్.. హైకోర్టు సూచ‌నల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని వీకెండ్ లాక్‌డౌన్ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని లాక్‌డౌన్ కంటే మంచి చికిత్సను అందించ‌డమే ముఖ్య‌మ‌న్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుందని ఈ విష‌యాన్ని కూడా గ‌మ‌నించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news