గెలిచినవాళ్లనే కాపాడుకోవాలా.. ఓడిన వాళ్లనే బుజ్జగించాలా… బాబు తనకు తాను వేసుకుంటున్న ప్రశ్నలు ఇలాగే ఉంటాయేమో! ఒకపక్క ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లూ సైకిల్ దిగిపోతున్నారని వార్తలు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారూ కండువాలు పక్కన పాడేస్తున్నారని కథనాలు.. వెరసి బాబుకు ఈ వేసవిలో ఉక్కపోత మరింత ఎక్కువైపోయిందంట!
బాధ్యతలు పంచుకోవాల్సిన కొడుకు అసమర్ధుడిగా మిగిలిపోవడం.. మిగిలిన సీనియర్లను బాబు పూర్తిగా నమ్మలేకపోవడం వంటి సమస్యలు సైతం బాగుకు మరింత తలనొప్పిగా మారాయని అంటున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే… పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి ఒకరు సైకిల్ దిగిపోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి!
అవును… విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భవిష్యత్తు గురించి పక్కాగా ప్లాన్ చేసుకున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సైకిల్ దిగిపోవాలని ఫిక్సయ్యారంట. ఆచంట నియోజకవర్గానికి చెందిన పితాని సత్యనారాయణ గతంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించి మంత్రి అయ్యారు. చంద్రబాబు హయాంలో టీడీపీలో చేరిన వెంటనే 2014లో విజయం సాధించారు. 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మంత్రిగా పనిచేశారు. అయితే… దాదాపు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన పితాని పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదంట.
2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో ఆయన మాటలను ఎవరూ ఖాతరు చేయడం లేదుట. ఇదే క్రమంలో నిన్న మొన్నటి వరకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి కీలక నాయకుడిగా ఉన్న ఆయన స్థానంలో… వైసీపీ నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కౌరు శ్రీనివాసు రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారట. ఇది కూడా ప్రస్తుతం పితానికి మింగుడు పడని విషయమే. దీంతో ఇక ఆలోచించేది లేదని, వైకాపా కండువా వేసేసుకోవాలని పితాని నిర్ణయించుకున్నారంట.
కాగా ప్రస్తుతం ఆచంటలో మంత్రి చెరుకువాడ రంగనాథరాజు చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ, వయోః భారంతో ఉన్నారు. దీంతో… వచ్చే ఎన్నికల నాటికి ఆయన తిరిగి పోటీ చేస్తారా లేదా అన్న సందేహమే పితానిని వైసీపీ వైపు నడిపించడానికి దోహదపడుతుందని అంటున్నరు. సరే.. నరుడు ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లుగా… పితాని అయితే రావాలనుకుంటున్నారు కానీ… జగన్ ఏమనుకుంటున్నారో తెలియాలంటే ఇంకాస్త కాలం ఆగాల్సిందే!
ఆ సంగతి అలా ఉంచితే… పితాని సైకిల్ దిగడం మాత్రం టీడీపీకి పెద్ద దెబ్బే అని అంటున్నారు పశ్చిమగోదావరి జిల్లా సైకిల్ అభిమానులు! మరి పితానిని బాబు బిజ్జగించి ఆపుతారా లేక ఉన్నవాళ్లంతా మంచోళ్లు, పోయినోళ్లంతా చెడ్డోళ్లు అంటూ కాలం వెళ్లదీస్తారా అనేది వేచి చూడాలి!