మూడు రోజులుగా సాగుతున్న రెజ్లర్ల ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ నిరసనలు చేస్తున్న రెజ్లర్లు ఎట్టకేలకు శాంతించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వారి మీటూ ఉద్యమాన్ని విరమించారు. తమ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా దిగి వచ్చి ఈ సమస్యలపై రెండో దఫా చర్చలు జరిపారు.
దీంతోపాటు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఐఓఏ ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. స్టార్ బాక్సర్ మేరీకోమ్, మేటి ఆర్చర్ డోలా బెనర్జీ, దిగ్గజ రెజ్లర్ యోగేశ్వర్ దత్, అలక్‌నంద అశోక్ (ఐఓఏ సంయుక్త కార్యదర్శి), సహ్‌దేవ్ యాదవ్ (భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఐఓఏ కోశాధికారి), న్యాయవాదులు తాలిష్ రాయ్, శ్లోక్ చంద్ర కమిటీలో ఉన్నారు. దీనిలో భాగంగా సమస్యలను పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చారు.
దీంతో రెజ్లర్లు నిరసనలు విరమించారు. ఇందుకోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని, అది నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుందని అనురాగ్ తెలిపాడు. కమిటీ విచారణ పూర్తయ్యేవరకు బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాడని అనురాగ్ చెప్పాడు.