విశాఖ వాసులను వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న విశాఖ వాసులు మరోవైపు ఊహించని సంఘటనలతో కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. త్వరలో పరిపాలన రాజధాని గా మారబోతున్న విశాఖలో ఇలా వరుస ప్రమాదాలు.. ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.
కేవలం మూడు నెలల సమయంలోనే ఏకంగా 3 భారీ ప్రమాదాలు జరిగి ఎంతో ప్రాణ నష్టాన్ని కలిగించాయి. విశాఖ వాసులు అందరినీ భయంతో వణికించాయి ఈ ప్రమాదాలు. మే 7వ తేదీన విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువుల లీకై ఏకంగా పది మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. ఎంతో మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక ఈ ఘటన నుంచి కోలుకోకముందే.. కంటైనర్ యార్డ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి ప్రజలందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇక ఈ రోజు విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదంలో ఏకంగా పదకొండు మంది మృతి చెందారు. విశాఖ లో వరుస ప్రమాదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి.