విశాఖ‌ ప్రమాదం.. మాణిక్యాలరావు మరణం.. జనసేనాని భావోద్వేగం..!

విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో పది మంది మరణించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకోవాలని, షిప్ యార్డ్ సంస్థ ప్రతి మృతుని కుటుంబం నుంచి ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే విశాఖలో వరుస ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఎల్జీ పాలిమర్స్, సాయినర్, రాంకీ సెజ్ దుర్ఘటనలు కళ్ల ముందు ఉండగానే క్రేన్ ప్రమాదం జరగడం శోచనీయం. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు మరణ వార్త విని విచారానికి లోనయ్యానని పవన్ కళ్యాణ్ అన్నారు. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన ఒక నేతను కోల్పోయాం. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిసున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రజలకీ, పార్టీ శ్రేణులకు వెన్నుదన్నుగా నిలిచిన నాయకుడాయన. ఇటీవల తాడేపల్లిగూడెంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన మరణం తాడేపల్లిగూడెం ప్రాంతవాసులకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక లోటు. మాణిక్యాలరావుకి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తెలియజేశారు.