జనసేన పార్టీని ఏమూహూర్తానా ప్రకటించారో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కానీ.. వరుసగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. జనసేనుకు రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మస్థయిర్యం నింపడంలో పూర్తిగా విఫలం అయ్యారని పార్టీ నేతలే ఆరోపిస్తుండటం, దీనికి నిదర్శనం అన్నట్లుగా పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ బీజేపీ, వైసీపీలో చేరిపోతున్నారు.
మరి ఇలా జనసేన రోజు రోజుకు బలహీన పడుటకు ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ వైఖరే కారణమని పార్టీని వీడుతున్న నేతలు ఆరోపిస్తుండటం పట్ల ఒకింత ఆశ్చర్యం కలుగకమానదు… అయితే ఇప్పుడు జనసేనను వీడిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు హనుంతుడి తోకలా పెరిగిపోతూనే ఉంది . పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. నిన్నటి నిన్న పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీనీ వీడి 24గంటలు కాకుండానే మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.
జనసేనకు విశాఖ జిల్లాల్లో కీలకనేతగా ఉన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనను వీడుతున్నట్లు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పంపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట్రామయ్య గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.చింతలపూడి వెంకట్రామయ్య రాజీనామాతో పెందుర్తి, గాజువాకలో జనసేన పార్టీ ఖాళీ అయినట్లే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈవలసలను నిలువరించడంలో పూర్తిగా విఫలం అయినట్లు కనిపిస్తుంది.
వాస్తవంగా గత ఎన్నికలకు ముందు వెంకట్రామయ్య గాజువాక సీటు ఆశించారు. ఆయన గాజువాకలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో అక్కడ పోటీ చేసేందుకు యేడాదిన్నర కాలంగా వర్క్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పవన్ స్వయంగా అక్కడ నుంచి పోటీ చేయడంతో వెంకట్రామయ్యను పెందుర్తి పంపగా అక్కడ ఓడిపోయారు. అయితే వెంకట్రామయ్య మాత్రం తాను గాజువాకలో వర్క్ చేసుకున్నానని… అక్కడ 15 ఏళ్లుగా ప్రజలతో మమేకమయ్యానని తాను అక్కడ పోటీ చేస్తే గెలిచేవాడినని సన్నిహితుల వద్ద వాపోయారు. ఇక నాదెండ్ల మనోహర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు సైతం పవన్ చర్యలతో విసిగిపోతున్నారని.. వారు కూడా రేపో మాపో పార్టీ మారిపోతారని అంటున్నారు.