కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌ను పాటిస్తోంది. జనాలు బయటకు రాకుండా పెద్ద ఎత్తున ఇండ్లలోనే ఉంటున్నారు. దీంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో జనాలు పెద్ద ఎత్తున మూవీలు, సిరీస్‌లు, ఇతర వీడియోలు చూస్తున్నారు. దీంతో సహజంగానే ఇంటర్నెట్ డేటా పెద్ద ఎత్తున ఖర్చవుతోంది. అయితే ఇంత ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తే.. ఇంటర్నెట్ అయిపోతే.. డేటా ఖర్చయితే.. ఎలా..? అన్న సందేహం ఇప్పుడు జనాలకు వస్తోంది.
జనాలు ఆఫీసులను వదిలి పెద్ద ఎత్తున ఇండ్లలోనే ఉంటున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైంది. అయినప్పటికీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నదేమిటంటే.. డేటా వినియోగం పెరిగినా ఏమీ కాదని అంటున్నారు. కాకపోతే పలు చోట్ల తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. ఎందుకంటే.. ఆఫీసుల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ వినియోగం ఉంటుంది కాబట్టి.. అందుకు తగిన హార్డ్‌వేర్ అక్కడ ఉంటుంది. కానీ ఇండ్లకు ఇచ్చే ఇంటర్నెట్‌కు గాను తక్కువ సామర్థ్యం ఉన్న హార్డ్‌వేర్‌ను అమరుస్తారు. అందువల్ల నెట్‌వర్క్ బ్యాండ్‌విడ్త్ పెరిగితే ఆ హార్డ్‌వేర్ ఆ కెపాసిటీని భరించలేక చేతులెత్తేస్తుంది. దీంతో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలకు ఆటంకం ఏర్పడుతుందే తప్ప.. ఇంటర్నెట్ అయిపోతుంది.. డేటా ఖర్చవుతుంది.. అన్న బెంగ అక్కర్లేదు. ఎవరైనా నిర్భయంగా నెట్‌ను వాడుకోవచ్చు.
అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీల్లో పనిచేసే సిబ్బంది తక్కువ అయిన నేపథ్యంలో ఏదైనా ఇంటర్నెట్ సమస్య వస్తే అది పరిష్కరించేందుకు సహజంగానే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ సమయమే పడుతుందని నెట్‌వర్క్ నిపుణులు చెబుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నందున నెట్‌వర్క్ సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందని, అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఎలాంటి ఇబ్బంది రాదని వారు చెబుతున్నారు. కనుక నెట్ వినియోగదారులు కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్ అయిపోతుందని దిగులు చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు..!