టీఆర్ఎస్‌లో నాటి హీరో…. నేడు జీరో… ఆ లీడ‌ర్ ఫ్యూచ‌ర్ డైల‌మానే..!

-

తెలంగాణ రాజ‌కీయ చిత్రంపై ఓ వెలుగు వెలిగిన మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. త‌న రాజ‌కీయ జీవితంలో అనేక ఎత్తు ప‌ల్లాల‌ను చూసిన ఆయ‌న ఇప్పుడు ప‌ల్లంలో ఉన్నార‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్యక్త‌మ‌వుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక ఆయ‌న టీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు. వ‌రంగ‌ల్ ఎంపీగా విజ‌యం సాధించి  కేసీఆర్ సూచ‌న మేర‌కు రాజీనామా చేశారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే టి. రాజ‌య్య‌ను అనుహ్యంగా ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన కేసీఆర్ అంతే అనుహ్యంగా క‌డియంకు ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఈ ప‌రిణామంతో నాలుగేళ్ల‌పాటు రాజ‌కీయాల్లో శిఖ‌రాగ్రాన్ని కొన‌సాగించారు.

అయితే ఎందుకనో కేసీఆర్ కడియంకు గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌లేదు. వాస్త‌వానికి ఆయ‌న స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్ ఆశించారు. లేదంటే క‌నీసం త‌న కూతురుకు ఎంపీగా అవ‌కాశం ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న‌ను కేసీఆర్ ముందుంచినా రెంటిని అధిష్ఠానం ప‌క్క‌న పెట్ట‌డంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపం చెందార‌ని స‌మాచారం. అసెంబ్లీ ఫ‌లితాల త‌ర్వాత ఆయ‌న అధిష్ఠానం పెద్ద‌ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల జరిగిన జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విష‌యంలోనూ ఘ‌న్‌పూర్‌లో ఆయ‌న వ‌ర్గీయులెవ‌రికీ టికెట్ ద‌క్క‌కుండా రాజ‌య్య చ‌క్రం తిప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో క‌డియం వ‌ర్గీయుల్లో అస‌మ్మ‌తి గూడుకట్టుకుంటోంద‌ని తెలుస్తోంది. ఓ ద‌శ‌లో క‌డియం పార్టీ మారాల‌నే డిమాండ్‌ను వారు తెర‌పైకి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ డిమాండ్‌ను క‌డియం పూర్తిగా కొట్టిపారేయ‌కుండా వేచి చూసే ధోర‌ణిలో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కొద్ది కాలం క్రితం ఆయ‌న‌కు మంత్రి వ‌ర్గంలో స్థానం ల‌భిస్తుంద‌ని, లేదంటే మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని కేసీఆర్ ఇస్తార‌న్న అభిప్రాయం ఓరుగ‌ల్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో, సొంత పార్టీలో బ‌లంగా వినిపించింది. అయితే అవేవీ నిజం కాలేదు. క‌డియం త‌న‌కు రాజ‌కీయ గురువుగా చెప్పుకునే ఎమ్మెల్సీ స‌త్య‌వ‌తి రాథోడ్‌కు కేసీఆర్ పిలిచి మ‌రీ మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. పూల‌మ్మిన చోటే క‌ట్టెలమ్మాల్సి వ‌స్తోంద‌ని క‌డియం , ఆయ‌న వ‌ర్గీయులు తీవ్ర మ‌నోవేద‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఓరుగ‌ల్లు రాజ‌కీయంలో ఇప్పుడంతా ఎర్ర‌బెల్లి హ‌వా న‌డుస్తోంది. టీడీపీలో అనేక సంవ‌త్స‌రాలు క‌ల‌సి ప‌నిచేసిన ఎర్ర‌బెల్లి, క‌డియం మొద‌టి నుంచి ఉప్పు నిప్పులా ఉండేవారు. అనేక మార్లు ఒకే వేదిక‌పై విమ‌ర్శ‌లు..ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు దిగిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇప్పుడు క‌డియంను ప‌క్క‌న పెట్ట‌డానికి ఎర్ర‌బెల్లియే కార‌ణ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాక..రాక‌..మంత్రి ప‌ద‌వి వ‌స్తే వ‌దులుతానా..? అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎమ్మెల్యేలు స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుంటున్నార‌ట‌.

క‌డియంకు ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేదు. స్వ‌త‌హాగా రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకున్నారు. ఆయ‌న పైర‌వీల‌కు,ప్ర‌లోభాల‌కు  దూరంగా ఉంటార‌నే పేరుంది. ఆ మంచి క్వాలిటీసే ఆయ‌న్ను గ‌త ప్ర‌భుత్వంలో ఉప ముఖ్య‌మంత్రిగా చేశాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. క‌రుకుగా వ్య‌వ‌హ‌రించ‌డం..రాజ‌కీయంగా త‌న వ‌ర్గానికి పెద్ద‌పీట వేయాల‌నే ప్ర‌య‌త్నాల‌తోనే ఆయ‌న్ను పార్టీ అధినేత కాస్త ప‌క్క‌న పెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రాజ‌కీయ భ‌విష్య‌త్ అనిశ్చితిలో ప‌డిన‌ క‌డియం ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌నే దానిపై ఓరుగ‌ల్లు రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేపుతోంది.

ఆయ‌న కొండా దంప‌తుల‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్నార‌నే కోణాన్ని ఆవిష్క‌రిస్తున్న కొంత‌మంది ఆయ‌న త్వ‌ర‌లో  కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని చెప్పుకురావ‌డం  విశేషం. రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాదు..అట్లాది పార్టీలు మార‌డం ఏ స్థాయిలో ఉన్న‌వారికైనా పెద్ద‌గా అడ్డేమీ కాదని అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. చూడాలి. మ‌రీ క‌డియం టీఆర్ ఎస్‌లో క‌ష్ట న‌ష్టాలు భ‌రిస్తూ ఉంటారా…?  లేదంటే కారు దిగి…త‌న దారి తాను చూసుకుంటారా అన్న‌ది కొద్ది రోజులు ఆగితే గాని  తెలియ‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news