దాదాపు 40 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె తీవ్రంగా జరుగుతుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలి అంటూ కార్మికులు బస్సు దిగి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తమ కష్టాలను విని తమను ఆదుకోవాలని కోరారు. దసరా పండుగ ముందు నుంచి కార్మికులు ఉద్యమంలోకి దిగినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వారికి ఒక్క అనుకూలమైన ప్రకటన రాలేదు. ఎంత సేపు వారిని బెదిరిస్తూ మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడటమే గాని ఏ ఒక్క నిమిషం కూడా వారి ఇబ్బందుల గురించి ప్రభుత్వం ఆలోచించిన దాఖలాలు లేవు అనేది కార్మికుల ఆవేదన.
సెప్టెంబర్ నెల జీతాలు వారికి అందలేదు… అక్టోబర్ నెల మొత్తం సమ్మెలోనే ఉన్నారు. ఈ రెండు నెలల నుంచి వారికి జీతాలు అందే పరిస్థితి ఇప్పుడు లేదు. హైకోర్టు లో ఉద్యమంపై వాదనలు నడుస్తున్నాయి. దాదాపు 50 వేల మందికి పైగా కార్యకర్తలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు వారి కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు, బ్యాంకు లోన్లు, ఇతరత్రా రుణాలు ఇలా కార్మికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా మంది కార్మికులు పుస్తెలు తాకట్టుకునే పరిస్థితి ఉందనే ఆందోళనకర విషయాలు బయటకు వస్తున్నాయి.
ఎవరు ఎన్ని చెప్పినా సరే నాయకుల పట్టుదలతో కార్మికుల జీవితాలు ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నాయి అనేది వాస్తవం. వేలాది మంది కార్మికులు ఇప్పుడు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం స్థాయిలో ఇది జరుగుతుందని పరిశీలకులు కూడా అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని వారి ఉద్యోగాలను తొలగిస్తే వారి భవిష్యత్తు ఏంటి అనేది ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే ఆర్టీసీ ని ప్రయివేట్ పరం చెయ్యాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపణలు వినపడుతున్నాయి. రేపు అదే జరిగితే వారి పరిస్థితి ఏంటి అనేది చెప్పలేం. ఇక ఇప్పటికే దాదాపు 5000 రూట్లలో ప్రయివేట్ బస్సులు ప్రవేశ పెడతామని అంటున్నారు. హైదరాబాద్ లో సిటీ బస్సులు రద్దు చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇవన్నీ జరిగితే… మా కుటుంబాలు, మా పిల్లల పరిస్థితి ఏంటీ అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు పట్టు వదిలి వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని కోరుతున్నారు.