ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని వ్యాఖ్యానిస్తూ ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో వాదనలు చేయగా స్పందించిన కోర్ట్… సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని అభిప్రాయపడింది. అదే విధంగా క్రిష్నయ్య మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ గా ప్రకటించారు కాబట్టి ఎస్మా ప్రయోగించాలని, సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోర్ట్ ని కోరగా కోర్ట్ స్పందిస్తూ ఆయనకు సమాధానం ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని స్పష్టం చేసింది. అలాగే ప్రజాప్రయోజనాల పేరిట ఆధారాలు లేకుండా విచిత్రమైన సమస్యలను తమ ముందుకు తీసుకొస్తే.. తాము రిలీఫ్ ఇవ్వలేమని, ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యానికి గతంలో… కార్మికులతో చర్చలు జరపాలని అనేకసార్లు తాము కోరామని కోర్ట్ వ్యాఖ్యానించింది.
తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని స్పష్టం చేసిన కోర్ట్ విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటె దాదాపు 40 రోజుల నుంచి జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తోంది అనే ఆందోళన అందరిలోను నెలకొంది. రాజకీయ పక్షాలు కూడా సమ్మెకు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వం అనేక మార్లు డెడ్ లైన్ పెట్టినా కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో సమ్మెను తెలంగాణ ఉద్యమంతో పోలుస్తున్నారు పలువురు.