గురుపౌర్ణమి రోజు ఏం చేయాలి ?

-

ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ఈ రోజు గురువుల కృపకోసం భక్తి, శ్రద్ధలతో పూజలు లేదా వారిని గౌరవించడం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. ఈ రోజు ఏం చేయాలి అనే విశేషాలు తెలుసుకుందాం….

 

 

గురువును త్రిమూర్తి స్వరూపంగా ఆరాధిస్తాం మన సంప్రదాయంలో. అలాంటి గురుపౌర్ణమి రోజు ఉదయానే లేచి స్నానపూజాదికాలను చేసుకుని గురువు అంటే ఆదిశంకరాచార్యులు లేదా రామానుజులు లేదా సాయిబాబా లేదా వారివారి శాఖలు లేదా సంప్రదాయాలకు అనుగుణంగా గురువుల చిత్రపటాలను శుభ్రం చేసి వాటిని అలంకరించాలి. తర్వాత వారికి పూజలను చేయాలి. కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలు ఉంచాలి. ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. పూజ అయిన తర్వాత తలా ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్ళలోని బియ్యంలో కలుపుకుంటారు.

బియ్యం, కొత్త వస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని, నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటున్నారు. అందుచేత గురుపౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటన పెట్టి దేవతా స్తుతి చేయాలి గురుపౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతా స్తుతి చేయకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవునేతితో దీపమెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. గురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గురుపౌర్ణమి నాడు (ఆషాఢ శుద్ధ పౌర్ణమి) గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి  గురువులను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆడంబరాలు కాకుండా నిజమైన మనస్సుతో గురువులను గౌరవిస్తూ వారు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన గురుభక్తి. గురుదక్షిణ. గురుదేవో మహేశ్వర.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news