టెర్రస్ గార్డెన్ లో ఎలాంటి మొక్కలు పెంచాలంటే..?

-

మిద్దె తోటలు.. అదేనండి టెర్రస్ గార్డెన్ లు ఇప్పుడు నగరాల్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత టెర్రస్ గార్డెన్ ల సంఖ్య పెరిగిపోతోందని ఉద్యాన శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రజలు తమకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, పువ్వులు తామే పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిద్వారా ఆర్గానిక్ కూరగాయలు లభించడమే గాక.. గార్డెనింగ్ లో కాసేపు గడపడం, పచ్చని చెట్లు ఉండటం వల్ల ఆహ్లాదకరంగా అనిపించి శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతోంది. అయితే టెర్రస్ గార్డెన్ లో ఎలాంటి మొక్కలు పెంచితే మంచిదంటే..

టెర్రస్ గార్డెన్ లో కూరగాయలు, టమాటా, బెండకాయ, బీరకాయ , సోరకాయ వంటి కూరగాయలను పెంచడం ఈజీ. ముఖ్యంగా ఆకుకూరలు పెంచడం ఇంకా సులభం. ఇంకా కూరలో అతి ముఖ్యమైన.. కూరకు రుచిని తీసుకొచ్చే కరివేపాకును కూడా టెర్రస్ గార్డెన్ లో పెంచొచ్చు. కరివేపాకు మొక్క పది నుంచి ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కొంచెం పెద్ద సైజు కుండీలో దీన్ని నాటితే సరిపోతుంది. దీనికి పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆకులు ఎక్కువగా రావడానికి లిక్విడ్ ఫర్టిలైజర్ చేరిస్తే బాగుంటుంది. కంపోస్ట్ వేసిన మట్టిని దీన్ని నాటేందుకు ఉపయోగించాలి. నేల కాస్త ఆమ్ల తత్వంతో ఉండేలా చూసుకోవాలి. దీనికోసం మజ్జిగను పోయవచ్చు. వేసవిలో కాస్త ఎక్కువ నీళ్లు పోస్తుండాలి. మిగిలిన సీజన్లలో అప్పుడప్పుడూ పోస్తే సరిపోతుంది.

కూరగాయలే కాకుండా మిద్దె తోటలపై పండ్లు కూడా పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టెర్రస్ గార్డెన్ లో బొప్పాయి కూడా పెంచుకోవచ్చట. ఇందులో మూడు రకాల మొక్కలుంటాయి. ఆడ, మగ మొక్కలు వేర్వేరుగా కొన్నింట్లో ఉంటే ఆడ,మగ కలిసి ఉన్న మొక్కలు కూడా కొన్ని ఉంటాయి. ఇలా రెండు కలిపి ఉన్న మొక్కలు కొనడం మంచిది. వీటిని పెంచేందుకు మంచి నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎండ ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి.

పల్లెటూరిలో జామ చెట్టు ఉండని ఇల్లు ఉండదు. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లోనూ ఈ మొక్కలు పెంచుతున్నారు. అయితే కాంక్రీట్ జంగల్ లో చెట్లు పెంచడానికి ఖాళీ స్థలం ఉండదు కనుక టెర్రస్ పై పెంచుతున్నారు. ఒక పెద్ద వెడల్పాటి కుండీలో జామ మొక్క నాటాలి. దీన్ని పెంచేందుకు నేలలో పీహెచ్ 6 నుంచి 7.5 ఉండేలా చూసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు రోజూ నీళ్లు పోయాల్సి ఉంటుంది. సరైన ఫర్టిలైజర్లు కూడా అందించాలి. కాస్త పెద్దదై పండ్లు ఇవ్వడం ప్రారంభిస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు పండ్లు అందిస్తుంది.

రోజూ మనం తీసుకునే ఆహారంలో నిమ్మ కూడా ఉంటుంది. నిమ్మ రసం తాగడం, లెమన్ టీ, లెమన్ రైస్ ఇలా రకరకాల రూపంలో నిమ్మ మన ఆహారంలో భాగమవుతోంది. అయితే ఇప్పడు నిమ్మకాయలకు కూడా బాగా ధర పెరిగింది. అందుకే మన నిమ్మను మనమే పెంచుకోవాలి. టెర్రస్ పైన నిమ్మ పెంచుకోవాలంటే మధ్యస్థంగా ఉన్న కుండీలో దీన్ని పెంచుకోవచ్చు. మరుగుజ్జు నిమ్మను ఎంచుకుంటే మరీ మంచిది. నిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని చేర్చడం వల్ల వంటకాల రుచి మరింత పెరగుతుంది. నీరు ఎక్కువగా నిలువ ఉండని నేలలు దీనికి అవసరం. తగినంత నీటిని దీనికి అందిస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ కొమ్మలను ట్రిమ్ చేస్తూ ఉండాలి.

పండ్లలో రాజుగా మామిడిని చెబుతారు. మీ టెర్రస్ గార్డెన్ లో కూడా దీన్ని సులువుగా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కను పెంచేందుకు కంటెయినర్ కాస్త పెద్దగా ఉండాలి. నీళ్లు కుండీలో నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేళ్లు లోపలికి వెళ్లడానికి వీలుగా మెత్తని నేలను ఎంచుకోవాలి. నీళ్లు ఎక్కువగా అందించాలి. మొక్క కాస్త పెద్ద పెరిగే వరకు కాస్త జాగ్రత్తలు వహించాలి. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ ఉపయోగించి వీటిని సంవత్సరం మొత్తం భద్రపర్చుకోవచ్చు.

ఇవే కాకుండా టెర్రస్ పై రకరకాల పూల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఇలా టెర్రస్ అంతా ఖాళీగా ఉండకుండా కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పెంచుకుంటే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్గానిక్ కూరగాయలు, పండ్లతో ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అయితే కొందరు టెర్రస్ పై చెట్లు పెంచితే నీటి వల్ల బిల్డింగ్ కి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకుంటారు. కానీ అలాంటిదేం ఉండదని.. మొక్కలు పెంచడం వల్ల టెర్రస్ కి ఎలాంటి నష్టం జరగదని ఉద్యాన నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news