ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు కొత్తగా కార్ట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు వాట్సాప్‌లో మరింత సౌకర్యవంతంగా షాపింగ్ చేయవచ్చు. వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ల ద్వారా యూజర్లు ఇప్పటికే వస్తువులను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తున్న విషయం విదితమే. అయితే దీనికి కార్ట్స్ బటన్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో మరింత సులభంగా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
వాట్సాప్ బిజినెస్ అకౌంట్లలో యూజర్లు ప్రస్తుతం యాడ్ టు కార్ట్ బటన్ ను పొందవచ్చు. దీని సహాయంతో ఒక మర్చంట్ నుంచి భిన్నరకాల ఐటమ్‌లను ఒకే కార్ట్‌లో యాడ్ చేయవచ్చు. అనంతరం వాటిని ఒకేసారి ఆర్డర్ చేయవచ్చు. ఈ-కామర్స్ సైట్లలో మాదిరిగానే యూజర్లు కార్ట్‌లలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ ను యాడ్ చేయవచ్చు. అనంతరం వాటిని సింగిల్ మెసేజ్ ద్వారా సెల్లర్‌కు షేర్ చేయవచ్చు. తరువాత సెల్లర్ ఆర్డర్‌ను కన్‌ఫాం చేస్తూ రిప్లై ఇస్తారు. దీంతో యూజర్లు పేమెంట్ చేయవచ్చు.
ఇక ఈ విధంగా వస్తువులను కొనుగోలు చేసేందుకు వాట్సాప్ పే ఫీచర్ కూడా యూజర్లకు అందుబాటులో ఉంది. కాగా ఈ ఫీచర్ కోసం మర్చంట్లకు వాట్సాప్ కొత్తగా కార్ట్-థీమ్డ్ స్టిక్కర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో వారు తమ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవచ్చు.