నూతన ప్రైవసీ పాలసీ అమలుపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వాట్సాప్‌కు ఇప్పట్లో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే యూజర్ల దెబ్బకు దిగి వచ్చిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అమలుపై వెనక్కి తగ్గింది. నూతన పాలసీని మే 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా మరో వివాదం చెలరేగుతోంది.
వాట్సాప్ వెబ్‌కు సంబంధించిన కాంటాక్ట్‌లను గూగుల్ సెర్చ్ ఇండెక్స్ చేస్తుందని నిపుణులు వెల్లడించారు. వాట్సాప్ వెబ్‌కు చెందిన సర్వర్ ఫైల్‌లో ఇండెక్సింగ్ కు అనుమతి ఇస్తూ సెట్టింగ్స్ ఉన్నాయని, అందువల్ల వాట్సాప్ వెబ్‌ను వాడేవారి వివరాలు గూగుల్‌లో ఇండెక్స్ అవుతాయని, దీంతో హ్యాకర్లు సులభంగా ఆ కాంటాక్ట్‌లు, వాటిలో ఉండే మెసేజ్‌లను సేకరించి వాటితో యూజర్లను బ్లాక్ మెయిల్ చేయడం లేదా వాటిని తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించే చాన్స్ ఉందని సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.
అయితే ఇప్పటికే వాట్సాప్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ కొత్త సమస్య మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. వాట్సాప్‌లో తమ డేటాకు ఏమాత్రం భద్రత లేదని యూజర్లు భావిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడం అనుమానాలకు తావిస్తోంది. మరి వాట్సాప్ ఈ సమస్యను పరిష్కరిస్తుందా, లేదా చూడాలి.