ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. నూతన ప్రైవసీ పాలసీపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను ఇప్పటికే ప్రారంభించింది. అయితే వాట్సాప్ స్పష్టతపై యూజర్లు సంతృప్తి చెందలేదు. మరోవైపు వాట్సాప్‌ను తీసేసి ఇప్పటికే చాలా మంది సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌ను వాడడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో యూజర్లను కోల్పోవడం ఇష్టం లేని వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
నూతన ప్రైవసీ పాలసీని ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంది. ఆ లోగా అందుకు అంగీకరించని యూజర్లు వాట్సాప్‌ను వాడుకోలేరని ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. అయితే యూజర్ల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటును ఎదుర్కొన్న వాట్సాప్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ క్రమంలోనే నూతన ప్రైవసీ పాలసీని అమలు చేయడం లేదని, ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని, అలాగే ఫిబ్రవరి 8 దాటాక ఎవరి అకౌంట్లు డిలీట్ కావని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా వాట్సాప్‌పై ఆగ్రహంతో ఇప్పటికే కోట్ల మంది యూజర్లు ఆ యాప్‌ను తీసేసి అందుకు బదులుగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లను వాడడం మొదలు పెట్టారు. ఇందువల్లే వాట్సాప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తమ పాలసీపై తప్పుడు ప్రచారం జరుగుతుందని వాట్సాప్ తన తాజా ప్రకటనలో తెలియజేసింది.