టీడీపీలో ఓ కీలక విషయం చర్చకు వచ్చింది. మహానాడు సందర్భంగా ముఖ్య నేతలు లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ.. అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుని మరీ మంగళగిరిలో జరిగిన మహానాడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకుల మధ్య రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిపై చర్చ జోరుగానే సాగింది. దీనిని ప్రధాన మీడియాకు వెల్లడించకపోయినా.. మన అనుకున్న మీడియా మిత్రులకు మాత్రం చెప్పుకొచ్చారు. ఇలా తెలిసిన విషయాల్లో.. అత్యంత కీలకమైంది.. చంద్రబాబు గతంలో భుజాల మీదకు ఎక్కించుకున్న నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారనేదే!
గతంలో వైసీపీలో 2014లో విజయం సాధించిన నాయకులు తర్వాత చంద్రబాబు చెంతకు చేరిపోయారు. వారికి పదవులు కూడా లభించాయి. నిజానికి పార్టీ కొన్ని దశాబ్దాల తరబడి ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, బుచ్చయ్య వంటివారిని కూడా పక్కన పెట్టి అమర్నాథ్‌రెడ్డి, పితాని వంటివారికి పదవులు ఇచ్చారు. ఇక, మహిళలకు కూడా కీలక ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా.. గత ఏడాది ఎన్నికల్లోనూ చంద్రబాబు వారికి టికెట్లు ఇచ్చారు. అయితే, వారంతా జగన్ సునామీలో కొట్టుకు పోయారు. అయినా.. కూడా చంద్రబాబు వారికి గౌరవం ఇస్తూనే ఉన్నారు.
కానీ, ఇప్పటి వరకు మాత్రం సదరు నాయకులు గడప దాటి బయటకు రాకపోవడంపైనే సీనియర్లు తాజా మహానాడులో చర్చించుకున్నారు. మొత్తంగా 24 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. వీరంతా అలా జంపింగ్ సమయంలో ఆర్ధికంగా లబ్ధి పొందిన వారే. కానీ, ఇప్పుడు పార్టీ అవసరంలో ఉండే సరికి మాత్రం నాయకులు మొహం చాటేశారని, మహిళా నాయకురాళ్లయితే.. పార్టీ గురించి కనీసం కూడా పట్టించుకునే తీరిక కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని సీనియర్‌లు మండిపడ్డారు. మాజీ మంత్రి ఒకరు మాట్లాడు తూ.. మన బంగారం మంచిదైతే.. వాళ్లని అనుకోవడం ఎందుకు? అంటూ బాబుపైనే ప్రతివిమర్శ చేశారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు బయటకు రాకపోయినా.. అంతర్గతంగా మాత్రం పార్టీలో చర్చనీయాంశంగానే మారాయి.