భారత్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అత్యవసర వినియోగానికి తాజాగా అనుమతులు లభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కంపెనీలు వ్యాక్సిన్‌లను పెద్ద ఎత్తున ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించాయి. తొలి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు భారత్ అతి పెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రారంభించనుంది. అయితే కరోనా వైరస్ కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అభినందించారు. కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టగలిగే సత్తా భారత్‌కు ఉందని అన్నారు.
కరోనా మహమ్మారి అనే సమస్యను పరిష్కరించేందుకు భారత్ నిర్ణయాత్మక చర్యలను తీసుకుంటుందని, ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న భారత్ కరోనాను అంతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు అద్భుతమని, మనమందరం కలసి కట్టుగా ఉండి కరోనాను అంతం చేయాలని, రిస్క్ ఎక్కువగా ఉన్నవారిని రక్షించాలని.. టెడ్రోస్ అన్నారు. ఈ క్రమంలో టెడ్రోస్ ప్రధాని మోదీని తన ట్వీట్‌లో మెన్షన్ చేశారు.
కాగా కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అనుమతి లభించినప్పటికీ రెండింటిలో ఏ వ్యాక్సిన్‌ను ముందుగా ప్రజలకు పంపిణీ చేస్తారన్న విషయంపై స్పష్టత రాలేదు. కోవిషీల్డ్‌కు చెందిన అన్ని క్లినికల్ ట్రయల్స్ డేటా అందుబాటులో ఉండగా, కోవాగ్జిన్ కు చెందిన 3వ దశ ట్రయల్స్ డేటా మార్చి వరకు అందుబాటులోకి రానుంది. దీంతో ఈ వ్యాక్సిన్‌పై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్ బయోటెక్ మాత్రం తమ వ్యాక్సిన్ కోవిడ్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.