సద్దుమణిగినట్టే కనిపించింది… అంతలోనే మళ్లీ ఉద్రిక్తత… రోడ్డెక్కిక బాధిత వర్గం..! ఎంపీపై కేసు పెట్టాలని డిమాండ్… వాగ్వాదాలు.. తోపులాటలు..! ఇదీ వెలగపూడిలో పరిస్థితి. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు పోలీసులు. అటు ఈ సంఘటనలో తుళ్లూరు CIపై కమశిక్షణ చర్యలు తీసుకున్నా వివాదం మొత్తం బాపట్ల వైసీపీ ఎంపీ సురేష్ చుట్టూనే తిరిగింది.
చిన్న ఆర్చి విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారి.. కొట్టుకోవడం వరకూ వెళ్లింది. చివరకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. గుంటూరు జిల్లా వెలగపూడి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బాధ్యులపై కఠిన చర్యలకు హోంమంత్రి హామీ ఇవ్వడంతో పాటు…ప్రభుత్వం 10 లక్షలు సహాయం ప్రకటించింది. అయినా కేసులో ఎంపీ నందిగాం సురేశ్ పేరును చేర్చాలంటూ బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు.
ఎంపీ నందిగం సురేష్ కారణంగానే ఇంత రచ్చ జరిగిందని బాధిత వర్గం ఆరోపిస్తోంది. ఆయనపై కేసు పెట్టాల్సిందేని డిమాండ్ చేస్తూ మృతదేహంతో మరోసారి నిరసన తెలిపింది. వారికి సర్దిచెప్పే క్రమంలో పోలీసులు – ఆందోళనకారుల మధ్య తోపులాటలు కూడా జరిగాయి. దీంతో సద్దుమణిగిందనుకున్న వ్యవహారం మళ్లీ ఉద్రిక్తతకు తెరలేపడంతో భారీగా పోలీస్ బలగాల్ని మోహరించారు.
మరోవైపు రాళ్లదాడి సంఘటనలో తుళ్లూరు CI ధర్మేద్రబాబు తీరుపై బాధితులు ఆరోపణలు చేయడంతో ఆయన్ని వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వర్గానికి CI మద్దతు తెలిపారన్నది వారి ప్రధాన ఆరోపణ. మరోవైపు ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యంపై విచారణ జరుపుతామని అంతకుముందే హోంమంత్రి సుచరిత ప్రకటించారు. ఆ ప్రకటన అనంతరం సీఐపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అంతకుముందు వెలగపూడిలో పరామర్శకు వచ్చిన ఎంపి, ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురయ్యాయి. పోలీసు రక్షణలో, హోంమంత్రితో పాటు వచ్చిన ఇద్దరు నేతలకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. అయితే ఘటనకు కారణం అయిన వారికి తమ మద్దతు ఉందన్న వాదనను ఇద్దరూ ఖండించారు. మొత్తానికి చిన్న విషయం వెలగపూడిలో రణరంగం వరకు వెళ్లింది. కేసులో ఎంపీ పేరును చేర్చాల్నిందేనని బాదుతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎలా సర్దుకుంటుందన్నది చూడాలి.