కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆ జిల్లాలో కనుమరుగయ్యారా ?

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి ఐదేళ్లు హుషారుగా పనిచేసిన నాయకులు..అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, దీక్షలు చేస్తున్నా ఎంత మంది వీటిల్లో పాల్గొంటున్నారన్నది ప్రశ్నగా మారిందట. ఇక రంగారెడ్డి జిల్లాలో ఉన్న కొద్దిమంది నేతలు పార్టీతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారట…


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విచిత్రంగా ఉందని అంటున్నారు. జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాలకు నేతలు కరువయ్యారు. అనేక ఆటుపోట్లు, కష్టాల మధ్య DCC అధ్యక్షులను ఎంపిక చేశారు. నియోజకవర్గం ఇంఛార్జ్‌ల నియామకమైతే అయోమయంగా మారిపోయింది. పీసీసీ, ఏఐసీసీ పోరాటాలకు, నిరసనలకు పిలుపు ఇస్తున్నా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతల నుంచి పెద్దగా స్పందన లేదట. దీనిపై గాంధీభవన్‌ నుంచి జిల్లా నాయకులకు ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వరకూ రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నప్పటికీ పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. ప్రతి జిల్లాలో పట్టుమని పదిమంది పేరు మోసిన నాయకులు లేరట. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హవా కొనసాగింది. అధికారం కోల్పోవడం.. ఎమ్మెల్యేల జంపింగ్‌లు.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పూర్తిగా డీలా పడింది.

ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా గెలిచారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం కాంగ్రెస్‌ ఖాతాలో చేరింది. ఇప్పుడు ఆ ఎంపీ ఒక్కరే కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎప్పుడో కారెక్కేశారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చిన తాండూరు, మహేశ్వరం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి అర్థం కావడం లేదట. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో నేతలు పత్తా లేరు.

మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీలో ఉన్నారో లేదో తెలియడం లేదట. అలాగే మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌ లాంటి నాయకులు ఒకటిరెండు కార్యక్రమాల్లో కనిపిస్తున్నా తర్వాత ముఖం చాటేస్తున్నారట. బిక్షపతి యాదవ్‌ ఇప్పటికే బీజేపీలో చేరగా మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్‌ త్వరలోనే కమలం తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇంఛార్జ్‌లు లేకపోవడంతో ఒక్కో నాయకుడు రెండు నియోజకవర్గాల బాధ్యతలను చూసుకుంటున్నారు. మరి.. పార్టీ పెద్దలు ఈ జిల్లాలపై దృష్టి పెడతారో లేక తమకేం పట్టనట్లు వదిలేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news