ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు దేశాలు ఈ విషయంలో ముందంజలో కూడా ఉన్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, భారత్‌లు కరోనా రేసులో పోటీ పడుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాక్సిన్ అయితే డిసెంబర్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండడం మాత్రం పక్కాగా కనిపిస్తోంది. అయితే మరి.. వ్యాక్సిన్ వస్తే దాన్ని ముందుగా ఎవరికిస్తారు ? అనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కరోనా వ్యాక్సిన్ ప్రజా పంపిణీకి సిద్ధం అయితే దాన్ని ముందుగా ఎవరికిస్తారు ? అత్యవసర సేవలను అందించే సిబ్బందికా ? అనారోగ్య సమస్యలు ఉన్నవారికా ? వృద్ధులు, పిల్లలకా ? లేదా పేదలకా ? అన్న విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే.. దేశంలో 130 కోట్ల జనాభా ఉంది. అంత మందికీ ఒకేసారి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం సాధ్యమయ్యే పనికాదు. అది దశలవారీగా ఉత్పత్తి అవుతుంది. కనుక దాన్ని అలాగే పంపిణీ చేయాలి. ఇక్కడే కేంద్రానికి అసలు సమస్య ఎదురు కానుంది.
కరోనా వ్యాక్సిన్ వస్తే.. దాన్ని ఎవరికి ముందుగా పంపిణీ చేయాలనే దానిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. దీనికి గాను పకడ్బందీగా విధి విధానాలను రూపొందించే పనిలో పడ్డారు. అయితే వ్యాక్సిన్ అంటూ వచ్చాక.. మెడికల్ మాఫియా ఎలాగూ ఉంటుంది కనుక.. ధనికులదే రాజ్యం అవుతుందని, ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వకముందే వారే అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో వ్యాక్సిన్‌ను కొంటారని, దీంతో వ్యాక్సిన్ ధర విపరీతంగా పెరిగి, పేదలకు అది అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ ఎలాగూ దశలవారీగా ఉత్పత్తి అవుతుంది కనుక.. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్‌కు మార్కెట్‌లో కొరత ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి. వ్యాక్సిన్ అంటూ వస్తే.. దాన్ని కేంద్రం పకడ్బందీ ప్రణాళికతో ప్రజలకు పంపిణీ చేయాలి. సంపన్నవర్గాలకు తలొగ్గితే మాత్రం.. పేదలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.