ప్రతి ఏటా క్రిస్మస్‌ను డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాతి రోజును బాక్సింగ్ డేగా వ్యవహరిస్తారు. అది కూడా పండుగ రోజే. బాక్సింగ్ డే రోజున పబ్లిక్ హాలిడే ఉంటుంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో బాక్సిండ్ డేను జరుపుకుంటారు. మొదటిసారిగా 1871లో బాక్సింగ్ డేకు హాలిడే ప్రకటించడం మొదలు పెట్టారు.
అయితే డిసెంబర్ 26న బాక్సింగ్ డేను జరుపుకుంటున్నా.. నిజానికి ఆ రోజు శనివారం అయితే వేడుకలను సోమవారంకు వాయిదా వేస్తారు. ఇక డిసెంబర్ 26 ఆదివారం అయితే బాక్సింగ్ డేను మంగళవారం జరుపుకుంటారు. అయితే బాక్సింగ్ డే అన్న పదం ఎలా వచ్చిందో ఇప్పటికీ తెలియదు. కానీ 1833 నుంచి ఈ పదాన్ని వాడడం మొదలు పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి.
సాధారణంగా క్రిస్మస్ పండుగకు గిఫ్ట్‌లను ఇచ్చుకుంటారు. వాటిని బాక్సుల్లో పెట్టి అందంగా అలంకరించి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే క్రిస్మస్ రోజు వచ్చిన బాక్స్‌లను మరుసటి రోజు ఓపెన్ చేసి వాటిలో ఉండే గిఫ్ట్‌లను తీస్తారు. అందుకనే ఆ రోజుకు బాక్సింగ్ డే అని పేరు వచ్చిందని అంటారు. అలాగే కంపెనీలకు ఉద్యోగులకు క్రిస్మస్ రోజు గిఫ్ట్‌లను బాక్సుల్లో పెట్టి ఇస్తాయి. వారు కూడా మరుసటి రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆ బాక్సులను ఓపెన్ చేస్తారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా చర్చిలకు వచ్చే విరాళాలను కూడా బాక్సుల్లో ఉంచి క్రిస్మస్ తరువాతి రోజు ఓపెన్ చేస్తారు. ఈ క్రమంలో ఇలా అనేక కార్యక్రమాలను చేస్తారు కనుకనే.. అన్నింటిలోనూ బాక్స్‌ల వినియోగం ఉంటుంది కాబట్టి.. క్రిస్మస్ తరువాతి రోజుకు బాక్సింగ్ డే అని పేరు వచ్చిందని చెబుతారు. అయితే ఇందుకు సరైన ఆధారాలు కూడా ఏమీ లేవు. కానీ బాక్సింగ్ డేను మాత్రం ఎప్పటి నుంచో జరుపుకుంటూ వస్తున్నారు.