ఆ టీడీపీ ఎమ్మెల్యేని పార్టీ మారేదాక వదలరా

-

చేతిలో ఎమ్మెల్యే పదవి ఉన్నా కాలం కలిసి రాకపోతే అన్నీ ఎదురు దెబ్బలే తగులుతాయి. ప్రకాశం జిల్లాలో ఆయన విషయంలోనూ అదే జరుగుతోంది. పార్టీ మారాలనే ఒత్తిళ్లను సైతం లెక్క చేయకపోవడంతో వ్యాపారం మూతపడింది. ఈ కష్టాల సుడిగుండంలో ఏడాదిన్నరగా ఈదుతూనే ఉన్నారు. రానున్న కాలంలో మరిన్ని సవాళ్లు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

గొట్టిపాటి రవికుమార్‌ ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి జంప్‌ చేసి సైకిల్‌ ఎక్కిన 23 మంది ఎమ్మెల్యేలలో ఒకరు. ఇలా జంప్‌ చేసిన 23 మంది ఎమ్మెల్యేలు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తే.. గొట్టిపాటి రవి ఒక్కరే గెలిచారు. కానీ.. వైసీపీ పవర్‌లోకి రావడం.. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో రవికి రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి. ఏడాదిన్నరగా ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని నెట్టుకొస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తిరిగి వైసీపీలోకి వచ్చేయాలని రవిపై అధికారపార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయట. దానికి ఆయన అంగీకరించడం లేదని సమాచారం. పదే పదే పార్టీలు మారితే రాజకీయంగా ప్రజల్లో చులకన అవుతామన్న భావనలో వైసీపీ ఆఫర్‌ను ఆయన తిరస్కరించినట్టు సమాచారం. ఈ నిర్ణయం వల్ల తనకు ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని మౌనంగానే భరిస్తున్నారు.

2004లో సీఎం వైఎస్‌ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన రవి.. నాడు మార్టూరు నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌ను అనుసరించారు. 2014లో అద్దంకి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ.. టీడీపీలోకి వెళ్లిపోవడంతో వైసీపీతో సంబంధాలు తెగిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రవిని తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. మాటలకు లొంగకపోవడంతో అధికారాన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు.

రవి ప్రదాన ఆదాయ వనరు గ్రానైట్‌ క్వారీలు. ప్రకాశం జిల్లా బల్లికురువలో ఆయనకు క్వారీలు ఉన్నాయి. ఏడాది క్రితం ఆయన క్వారీలపై అధికారులు దాడులు చేశారు. కడప నుంచి ప్రత్యేకంగా వచ్చిన సర్వేయర్లు తనిఖీలు చేసిన తర్వాత అక్రమాలు జరిగాయని 65 సార్లు నోటీసులు ఇచ్చారు. 324 కోట్ల జరిమానా కట్టాలని ఆదేశించారు. వాటిపై రవి కోర్టులో పోరాడుతున్నారు. క్వారీలు మాత్రం మూతపడ్డాయి. ఏడాదిన్నరగా ఒక అడుగు రాయి తీసింది లేదు. ఎమ్మెల్యే రవి సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారట. ఎన్నాళ్లిలా ఇబ్బంది పడతారు.. మనసు మార్చుకోవాలని సన్నిహితులు కూడా ఆయనకు నచ్చజెప్పాలని చూశారట. కానీ… ఆయన మాత్రం ఒకే ఆలోచనతో ఉండి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు సమాచారం.

వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా.. ఈ స్థాయిలో తనను వేధిస్తారని అనుకోలేదని సన్నిహితుల దగ్గర ఎమ్మెల్యే రవి వాపోయినట్టు తెలుస్తోంది. ఏడాదిన్నరగా ఈ ఇబ్బందులను భరిస్తున్న ఆయన.. వ్యాపారాలు మూతపడి.. రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి సతమతం అవుతున్నట్టు సమాచారం. రవి తన వైఖరి మార్చుకోకపోతే మరిన్ని కష్టాలు నష్టాలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news