పట్నం బ్రదర్స్ గత సాధారణ ఎన్నికల తర్వాత వీరి పేరు తెలంగాణ రాజకీయాల్లో బాగా హైలెట్ అయ్యింది. పట్నం మహేందర్‌రెడ్డి సీనియర్ నేత… మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన తాండూరులో పోటీ చేసి సిట్టింగ్ మంత్రిగా కాంగ్రెస్ అభ్యర్థి ఫైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఆయన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా ఉంటూ ఏకంగా కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించి పెద్ద సంచలనమే క్రియేట్ చేశాడు.
గత ఎన్నికలకు ముందు వరకు పట్నం ఫ్యామిలీ హవా మామూలుగా ఉండేది కాదు. మహేందర్‌రెడ్డి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే. ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఆయన భార్య వరుసగా మూడోసారి జడ్పీచైర్‌పర్సన్. ఇక సోదరుడు నరేందర్‌రెడ్డి కూడా వరుసగా ఎమ్మెల్సీ… ఇలా ఎక్కడ చూసినా పట్నం ఫ్యామిలీ హవానే ఉండేది. అయితే ఇప్పుడు వీరి సీన్ రివర్స్ అయ్యిందన్న గుసగుసలు వస్తున్నాయి. అసలు వీరి ఊసే ఎక్కడా లేదట.
తాండూరులో మహేందర్‌రెడ్డిపై గెలిచిన రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరి కేటీఆర్ వర్గంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్‌లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే రోహిత్‌దే పూర్తి ఆధిపత్యం అయింది. మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ కూడా రాలేదు. ఇక వీరి రాజకీయ ప్రత్యర్థి సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఏకంగా మంత్రి అయ్యారు. ఇప్పుడు జిల్లాలో సబిత హవా నడుస్తోంది.
ఇక మరో షాక్ కూడా పట్నం సోదరులకు తగిలింది. కొడంగల్‌లో నరేందర్‌రెడ్డి రేవంత్‌పై గెలిచినా అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యిందట. ఎమ్మెల్యేగా గెలవడానికి డబ్బు బాగా ఖర్చు చేయాల్సి వచ్చిందట. ఇప్పుడు కార్యకర్తలను ఆయన పట్టించుకోవడం లేదట. ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి లేకపోవడం.. అటు అధిష్టానం కూడా కొడంగల్‌ను పట్టించుకోకపోవడంతో నరేందర్‌రెడ్డి కూడా నియోజకవర్గానికి పెద్దగా రావడం లేదంటున్నారు.
ఏదేమైనా ఐదు సంవత్సరాలు పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చక్రం తిప్పిన పట్నం సోదరులకు ఇప్పుడు టీఆర్ఎస్‌లోనే చుక్కలు కనపడుతున్నాయి. మహేందర్‌రెడ్డికి ఏ పదవి లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన నరేందర్‌రెడ్డి తాను ఎమ్మెల్సీగా ఉన్నా బాగుండేదే అనుకుంటున్నారట.