తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చిందంటే చాలు.. తెలుగు ప్రజల లోగిళ్లు కళకళలాడుతుంటాయి. మామిడాకుల తోరణాలతో దర్శనమిస్తుంటాయి. చిన్నా, పెద్దా అందరూ నిత్యం ఉదయాన్నే తలస్నానం చేసి పూజలు చేశాక ఉగాది పచ్చడి తింటారు. అయితే ఉగాది రోజున తయారు చేసే ఉగాది పచ్చడిని అసలు ఎందుకు తినాలి..? దాని వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరు రుచులు కలిగిన పదార్థాలతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. వాటిలో వేపపూత ఒకటి. నిజానికి ఇది ఉగాది సమయంలోనే అందుబాటులో ఉంటుంది. అందుకని ఉగాది పచ్చడిలో వేపపూత వేస్తారు. ఈ క్రమంలో వేపపూతను తినడం వల్ల ఆయుర్వేద ప్రకారం శరీరంలోని అన్ని రోగాలు నయమవుతాయని చెబుతారు. శరీరంలోని ప్రతి అణువుకూ వేప పూత ఆరోగ్యాన్ని కలిగిస్తుందట. అందుకనే వేప పూత ఉన్న ఉగాది పచ్చడిని ఉగాది రోజు తినాలని చెబుతారు.
ఇక ఉగాది సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఆటలమ్మ, మశూచి వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యాధులు పలు వైరస్‌ల వల్ల వస్తాయి. అయితే శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధులు రావు. అలా జరగాలంటే వేప పూత తినాలి. అందుకనే ఉగాది పండుగ రోజు వేప పూత ఉన్న ఉగాది పచ్చడి తినమని చెబుతారు. అలాగే ఆ పచ్చడిలో ఉండే ఇతర రుచులు కలిగిన పదార్థాలు కూడా అనేక అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయి. ఉగాది పచ్చడిలోని బెల్లం జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గర్భిణీలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దగ్గు తగ్గుతుంది. రక్తం పెరుగుతుంది.
అలాగే ఉగాది పచ్చడిలో వేసే మామిడికాయ చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం పగలకుండా చూస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక చింతపండు మానసిక సమస్యలను దూరం చేస్తుంది. మిరియాలు శరీరంలోని నొప్పులను తగ్గిస్తాయి. శరీరంలోని బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. ఇక ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపం. కనుక ఉప్పును ఆ రోజు తీసుకుంటే శారీరక అనారోగ్య సమస్యలు పోతాయని, ధనం లభిస్తుందని చెబుతారు.